coronavirus new variant B.1.1.529 | కరోనా భయాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తరుణంలో కొత్త వేరియంట్ ఒకటి పుట్టుకొచ్చింది. ఇప్పటివరకు ఉన్న వేరియంట్లతో పోలిస్తే ఇది చాలా శక్తివంతమైనది కావడం ఇప్పుడు ప్రపంచ దేశాలకు దడపుట్టిస్తోంది. కొత్తగా బయటపడిన బి.1.1.529 వేరియంట్ వల్ల మరో కరోనా వేవ్ పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని కంగారుపడిపోతున్నారు. రోగ నిరోధక శక్తిని కూడా తట్టుకుని తొందరగా వ్యాప్తి చెందగలదని.. ఇప్పటివరకు మనం చూసిన వేరియంట్లలో ఇదే అత్యంత ప్రమాదకరమైనదని తెలిసి ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అసలు బి.1.1.529 వేరియంట్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? దీని గురించి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? భారత్‌లో ఈ వేరియంట్ ప్రభావం ఉందా? వంటి విషయాలు ఒకసారి చూద్దాం..
కరోనా కొత్త రకం బి.1.1.529 వేరియంట్ తొలుత దక్షిణాఫ్రికాలో నవంబర్ 11న బయటపడింది. ఇప్పటివరకు ఈ వేరియంట్‌తో దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ ప్రావిన్స్‌లో 77 కేసులు, బోట్సువానాలో నాలుగు కేసులు, హాంకాంగ్‌లో ఒక కేసు నమోదైంది. హాంకాంగ్ నుంచి దక్షిణాఫ్రికాకు వెళ్లొచ్చిన వ్యక్తిలోనే ఈ వేరియంట్‌ను గుర్తించడం గమనార్హం. హాంకాంగ్ నుంచి 36 ఏళ్ల వ్యక్తి అక్టోబర్ 22న దక్షిణాఫ్రికా వెళ్లాడు. నవంబర్ 11 వరకు అక్కడే ఉన్నాడు. తిరిగొచ్చిన తర్వాత ఆ వ్యక్తి క్వారంటైన్లో ఉన్న సమయంలో నవంబర్ 13న అతనిలో ఈ వేరియంట్ లక్షణాలను గుర్తించారు. అంటే ప్రస్తుతానికి దక్షిణాఫ్రికాలో మాత్రమే ఈ వేరియంట్ వ్యాప్తి కనిపిస్తుంది. ఈ కొత్త వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. అయితే ఈ వేరియంట్ ఎలా ఉత్పన్నమైనది అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లభించలేదు.
రోగ నిరోధక శక్తి లేని వ్యక్తిలో దీర్ఘకాలిక సంక్రమణ ద్వారా బి.1.1.529 వేరియంట్ పుట్టుకొచ్చి ఉంటుందని లండన్‌లోని యూసీఎల్ జెనెటిక్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన బయాలజీ ప్రొఫెసర్, డైరెక్టర్ ఫ్రాంకోయిస్ బలోక్స్ వెల్లడించారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తి అంటే.. హెచ్ఐవీ ఎయిడ్స్ రోగి ద్వారా ఈ వేరియంట్ ఉత్పన్నమై ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రపచంలోనే అత్యధికంగా ఎయిడ్స్ రోగులు ఉన్న దేశం దక్షిణాఫ్రికా. ఈ దేశంలో 8.2 మిలియన్లకు పైగా హెచ్ఐవీ బాధితులు ఉన్నారు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాలో బయటపడ్డ బీటా వేరియంట్ హెచ్ఐవీ సోకిన వ్యక్తి నుంచే ఉత్పన్నమైనట్లు అప్పట్లో శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో ఇప్పుడు కూడా ఈ కొత్త వేరియంట్ వారి నుంచే వచ్చి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.
చైనాలో తొలుత కనిపించిన కరోనా వైరస్‌తో పోలిస్తే బి.1.1.529 వేరియంట్ చాలా భిన్నమైనది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందులో మొత్తం 50 మ్యుటేషన్లు ఉండగా.. ఒక్క స్పైక్ ప్రోటీన్‌లోనే 30కి పైగా ఉత్పరివర్తనాలు ఉన్నట్లు పేర్కొంటున్నారు. డెల్టా వేరియంట్ కంటే కూడా ఈ కొత్త వేరియంట్లో మ్యుటేషన్లు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇంతకుముందు బయటపడిన వేరియంట్లలో కనిపించిన మ్యుటేషన్లు ఈ వేరియంట్లోనూ ఉన్నాయి. ఆల్ఫా, Mu, గామా, బి.1.1.318 వేరియంట్లలో కనిపించిన పి881హెచ్ మ్యుటేషన్ కూడా కొత్త వేరియంట్లో కనిపించింది. దీంతో పాటు ఎన్5017వై మ్యుటేషన్ కూడా ఇందులో ఉన్నట్లు గుర్తించారు. ఈ మ్యుటేషన్.. వైరస్‌ను తొందరగా వ్యాప్తి చెందించగలదని అధ్యయనాల్లో తెలిసింది. అంతేకాదు శరీరంలోని యాంటీబాడీస్ వైరస్‌ను గుర్తించకుండా చేసే కొత్త రకం మ్యుటేషన్లు కూడా ఈ వేరియంట్లో కనిపించాయి.
కొత్త వేరియంట్లో కనిపిస్తున్న మ్యుటేషన్లను బట్టి ఇది డెల్టా వేరియంట్ కంటే కూడా ప్రమాదకరమైనదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న కరోనా వైరస్ వ్యాక్సిన్లు కూడా దీనిపై అంతగా ప్రభావం చూపకపోవచ్చని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని ధ్రువీకరించేందుకు ఇంకా స్పష్టమైన వివరాలు కావాల్సి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బి.1.1.529 వేరియంట్ గురించి అర్థం చేసుకునేందుకు మరిన్ని వారాలు సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్‌వో) టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవ్ తెలిపారు. ఈ వేరియంట్ సోకిన వారి రక్తనమూనాలను పరిశీలించగా వైరల్ లోడ్ ఎక్కువగా ఉన్నట్లు ఎపిడెమిలాజిస్ట్ ఎరిక్ ఫీగెల్ డింగ్ వెల్లడించారు. దీని ప్రభావంతో దక్షిణాఫ్రికాలో పాజిటివ్ రేట్ వారం రోజుల్లోనే ఒక శాతం నుంచి 30 శాతానికి పెరిగిందన్నారు.
కొత్త వేరియంట్ నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది. అయితే బి.1.1.529 వేరియంట్‌కు చెందిన కేసులు ఇండియాలో నమోదు కాలేదని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. కొత్త వేరియంట్ పుట్టుకొచ్చిన నేపథ్యంలో పలు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సౌతాఫ్రికా, బోత్సువానా, హాంగ్‌కాంగ్ నుంచి వస్తున్న ప్రయాణికులపై స్క్రీనింగ్ చేస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ బయటపడిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. విదేశీ ప్రయాణికులపై పలు ఆంక్షలు విధించాయి. ఇప్పటికే దక్షిణాఫ్రికా, బోత్సువానా సహా మరో నాలుగు అఫ్రికన్ దేశాల నుంచి విమానాల రాకపోకలను నిలిపివేస్తూ యూకే, ఇజ్రాయెల్ వంటి దేశాలు నిర్ణయాలు తీసుకున్నాయి. విదేశీ ప్రయాణికులకు ఆస్ట్రేలియా కఠిన క్వారంటైన్ నిబంధనలు విధించనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
దడపుట్టిస్తున్న B.1.1.529 variant .. హెవీ మ్యుటేషన్లపై వ్యాక్సిన్లు పనిచేస్తాయా?
Covid B.1.1.529 Variant | కరోనా కొత్త వేరియంట్.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
ఇండియాలో B.1.1.529 వేరియంట్ కేసు నమోదు కాలేదు..
దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై జర్మనీ, ఇటలీ నిషేధం