న్యూఢిల్లీ: B.1.1.529. ఇప్పుడు ఈ కరోనా వేరియంట్ కలవరం సృష్టిస్తోంది. దక్షిణాఫ్రికాలో తాజాగా ఈ వేరియంట్‌ను గుర్తించారు. అయితే దీంట్లో అత్యధిక స్థాయిలో మ్యుటేషన్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆ మ్యుటేషన్ల వల్ల ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. బొత్సువానాలోనూ ఈ కోవిడ్ వేరియంట్ వైరస్ ఆనవాళ్లు ఉన్నాయి. కరోనావైరస్కు చెందిన సార్స్ సీవోవీ 2 .. ఇప్పటి వరకు 50 కన్నా ఎక్కువసార్లు మ్యుటేట్ అయ్యింది. ఇక వైరస్‌పై ఉండే స్పైక్ ప్రోటీన్ కూడా 30 సార్లు మారినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొన్నటి వరకు ఉగ్రరూపం దాల్చిన డెల్టా వేరియంట్ కన్నా కూడా.. B.1.1.529 వేరియంట్లో ఎక్కువ మ్యుటేషన్లు జరిగినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
స్పైక్ ప్రోటీన్‌లో మ్యుటేషన్లు ఎక్కువగా జరిగితే.. దాని వల్ల సంభవించే నష్టం కూడా ఎక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైరస్ ఎంత పరివర్తన చెందితే.. అప్పుడు రక్షణ అంత ప్రమాదకరంగా మారుతుంది. వ్యాక్సిన్లను కూడా బోల్తాకొట్టించే వేరియంట్లు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇమ్యూనిటీని చేధించే వేరియంట్లు ఏర్పడితే అప్పుడు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుంది. ఇప్పటి వరకు B.1.1.529 వేరియంట్‌కు చెందిన పది కేసులను ద్రవీకరించారు. మూడు కేసులు బోత్సువానాలో, ఆరు సౌతాఫ్రికాలో గుర్తించారు. ఒక కేసును హాంగ్‌కాంగ్‌లో పసికట్టారు. ముందుగా అంచనా వేసిన దాన్ని కన్నా ఎక్కువ వేగంగా B.1.1.529 వేరియంట్ వ్యాప్తి చెందినట్లు సౌతాఫ్రికా ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
నూ వేరియంట్..
గడిచిన రెండు వారాల్లో.. కరోనా శ్యాంపిళ్ల పరీక్షలో.. B.1.1.529 వేరియంట్ ఆనవాళ్లు 50 శాతం పెరిగినట్లు దక్షిణాఫ్రికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ టులియో ఒలివెరా తెలిపారు. మొదట్లో ఈ వేరియంట్‌ను ఎటువంటి శాంపిల్‌లోనూ గుర్తించలేదని, కానీ ఇప్పుడు మెజారిటీ శ్యాంపిళ్లలో ఆ వేరియంట్ ఉన్నట్లు ఆయన తెలిపారు. మ్యుటేషన్లు ఎక్కువ స్థాయిలో జరగడం.. చాలా వేగంగా B.1.1.529 వ్యాప్తి చెందడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం కరోనా వేరియంట్లకు గ్రీకు అక్షరమాలలోని అక్షరాలను ఫిక్స్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజా వరుసలో నూ అక్షరం రావాల్సి ఉంది. B.1.1.529 కొత్త వేరియంట్‌ను నూ వేరియంట్‌గా పిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
B.1.1.529 వేరియంట్లో మ్యుటేషన్లు, వ్యాప్తి ఎక్కువగా ఉన్నా.. ఆ వేరియంట్ వల్ల కలిగే నష్టాలపై ఇంకా క్లారిటీ లేదు. దీనిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేపడుతున్నారు. డెల్టా వేరియంట్ కన్నా ప్రమాదకరమైందా లేదా అన్న కోణంలోనూ స్టడీ చేస్తున్నారు. ఎంత వరకు ఈ కొత్త వేరియంట్ వినాశనం కలిగిస్తుందన్న దానిపై ఆలోచన చేయాల్సి ఉందని నిపుణులు అంటున్నారు. వ్యాక్సిన్లు కొంత వరకు మాత్రమే రక్షణ ఇవ్వగలవని, మాస్క్‌లు ధరించడం.. సోషల్ డిస్టాన్స్ పాటించడం లాంటివి చాలా కీలకమని వారంటున్నారు. వ్యాక్సిన్ల ప్రభావం నుంచి B.1.1.529 వేరియంట్ తప్పించుకుంటుందా అన్న కోణంలో శాస్త్రవేత్తలు స్టడీ చేయనున్నారు. ఇతర వేరియంట్ల కన్నా.. B.1.1.529 తో భయానక వ్యాధులు ఏమైనా వస్తాయా అన్న కోణంలోనూ అధ్యయనం కొనసాగిస్తున్నారు.