Virus Infections | వైరస్ ఇన్ఫెక్షన్లకు, నాడీ క్షీణతకు సంబంధించిన వ్యాధులకు మధ్య ఉన్న సంబంధంపై హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కీలకమైన విషయాలను గుర్తించారు. ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా, కోవిడ్-19 వంటి వైరస్ల ఇన్ఫెక్షన్ల సమయంలో పార్కిన్సన్ వ్యాధితో సంబంధం ఉన్న ఆల్ఫా-సైన్యూక్లిన్ అనే ప్రోటీన్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోవచ్చో ఈ అధ్యయనం వివరించింది. ఈ పరిశోధన ద్వారా వైరల్ ఇన్ఫెక్షన్లు, మెదడు కణాల్లో అసాధారణ ప్రోటీన్ సమూహాలు ఏర్పడడం మధ్య ఉండే సంబంధంపై మరింత అవగాహన లభించే అవకాశం ఉంది. ఈ అధ్యయనం సెల్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.
పార్కిన్సన్ వ్యాధిలో నాడీ కణాల్లో ఉండే ఆల్ఫా-సైన్యూక్లిన్ అనే ప్రోటీన్ అసాధారణంగా ఒకదానితో ఒకటి చేరి అమైలాయిడ్ అనే గడ్డలుగా మారే అవకాశం ఉంటుంది. ఇవి మెదడు కణాల సాధారణ పనితీరుకు ఆటంకం కలిగించే అవకాశం ఉంటుంది. పరిశోధకులు ఇన్ఫ్లుయెంజా, సార్స్-కోవ్-2 వంటి ఆర్ఎన్ఏ వైరస్‌లను పరిశీలించగా, వాటిలో ఆర్ఎన్ఏ జీ-క్వాడ్రుప్లెక్స్లు (ఆర్జీ4లు) అని పిలిచే ప్రత్యేక నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. వైరస్ ఇన్ఫెక్షన్ సమయంలో ఈ నిర్మాణాలు ఆల్ఫా-సైన్యూక్లిన్తో పరస్పర చర్య జరిపి, అది అమైలాయిడ్ గడ్డలుగా మారే విధానాన్ని ప్రభావితం చేస్తాయని పరిశోధనలో తేలింది.
ఈ ప్రక్రియలో డీడీఎక్స్39ఏ అనే రక్షణ ప్రోటీన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణ పరిస్థితుల్లో కణంలోని కేంద్రకంలో ఉండే ఈ ప్రోటీన్, వైరస్ ఇన్ఫెక్షన్ సమయంలో సైటోప్లాజంలోకి చేరుతుంది. అక్కడ ఇది వైరస్ ఆర్ఎన్ఏ నిర్మాణాలతోపాటు ఆల్ఫా-సైన్యూక్లిన్తోనూ అనుసంధానమవుతుంది. వైరస్ విస్తరణను అడ్డుకునేందుకు కణాలు ఉపయోగించే రక్షణ వ్యవస్థలో భాగంగా డీడీఎక్స్39ఏ పనిచేస్తుంది. ఇది వైరస్ ఆర్ఎన్ఏ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడడంతోపాటు, ఆ నిర్మాణం తెరుచుకున్నప్పుడు ఆల్ఫా-సైన్యూక్లిన్ అమైలాయిడ్ గడ్డలు ఏర్పడే ప్రక్రియ కూడా గణనీయంగా నెమ్మదిస్తుందని పరిశోధకులు గుర్తించారు.
అయితే వైరస్ సోకిన ప్రతిసారీ పార్కిన్సన్ వ్యాధి వస్తుందని ఈ అధ్యయనం చెప్పడం లేదు. వైరస్ ఇన్ఫెక్షన్ సమయంలో కణాల్లో వైరస్‌తో పోరాడే రక్షణ వ్యవస్థ, హానికరమైన ప్రోటీన్ గడ్డలు ఏర్పడకుండా అడ్డుకునే ప్రక్రియల మధ్య సమతుల్యత మారుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్లు పదేపదే రావడం లేదా దీర్ఘకాలం పాటు వాటికి గురికావడం వల్ల అనేక సంవత్సరాల తర్వాత నాడీ క్షీణతకు సంబంధించిన మార్పులు పెరిగే అవకాశం ఉందా అనే అంశంపై సీసీఎంబీ శాస్త్రవేత్తలు మరింత పరిశోధన చేస్తున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్లు, అసాధారణ ప్రోటీన్ సమూహాలు ఏర్పడడానికి సంబంధించిన వ్యాధుల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో ఈ పరిశోధన భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉందని పరిశోధకులు తెలియజేస్తున్నారు.