వ్జైనల్ వాష్ పేరిట రకరకాల ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. యోని ప్రాంతాన్ని శుభ్రపరిచేందుకు వీటిని వాడవచ్చా? లేదంటే, ఇదేమైనా మార్కెట్ మాయాజాలమా?
-ఓ పాఠకురాలు
అసలు వ్జైనల్ వాష్ అవసరం ఏమిటన్నది నాకు అర్థం కాదు. చాలామంది వీటితో యోని బయటే కాదు, లోపలా కడుగుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. యోని ప్రాంతంలోని తేమకు ఇవి హాని చేస్తాయి. అక్కడ పీహెచ్ స్థాయి నాలుగు కంటే తక్కువగా ఉంటుంది. అంటే ఆమ్ల గుణం అధికం అన్నమాట. దానివల్ల ఎలాంటి హానికారక క్రిములూ పెరగకుండా ఉంటాయి. సాధారణంగా ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రభావంతో యోని గోడల మీద ైగ్లెకోజెన్ గ్రాన్యూల్స్ అనే ఒక రకం చక్కెరలు ఏర్పడతాయి. ఇక్కడ ఉండే లాక్టోబ్యాసిైల్లె అనే మంచి బ్యాక్టీరియా చక్కెరలపై చర్య జరపడంతో ఆమ్లాలు రూపొందుతాయి.
అయితే, అండం విడుదల సమయంలో తీగల్లాంటి స్రావాలు వస్తాయి. దీంతో ఇక్కడ ఆమ్ల స్వభావం తగ్గిపోతుంది. ఎందుకంటే శుక్రకణాలు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి రెండూ సమం అయినప్పుడే శుక్రకణాలు లోపలికి వెళ్లగలుగుతాయి. అలా కాకపోతే అవి చనిపోతాయి. దీనినంతా నియంత్రించే లాక్టోబ్యాసిైల్లె కూడా ఈ తరహా వాష్‌ల వల్ల మరణిస్తాయి. జిగురూ మటుమాయం అవుతుంది. ఇది ప్రమాదకర ధోరణి! ఈ బ్యాక్టీరియా లేక పోవడం వల్ల అక్కడ దురద, బ్యాక్టీరియల్ వ్జైనోసిస్లాంటి వ్యాధులతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్లూ వచ్చే అవకాశం ఉంది. అందుకే, శుభ్రమైన నీళ్లతో ఆ ప్రాంతాన్ని బయట వరకూకడిగితే చాలు. ఎన్ని ప్రకటనలు గుప్పించినా.. సున్నితమైన చోట రసాయన వాష్‌లు వాడనేకూడదు.
– డాక్టర్ పి. బాలాంబ,
సీనియర్ గైనకాలజిస్ట్