అధిక బరువు.. ఇప్పుడు చాలామంది సతమతమవుతున్న సమస్య ఇదే. ప్రతి ఐదుగిరిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించుకునేందుకు చాలామంది వ్యాయామం, యోగాతోపాటు డైట్ పాటిస్తున్నారు. ఎన్నిచేసినా బెల్లీ ఫ్యాట్ తగ్గకపోవడంతో నిరుత్సాహపడుతుంటారు. కాగా, బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే వ్యాయామం, డైట్ పాటించడంతోపాటు రాత్రి భోజనం (డిన్నర్)పై దృష్టిపెట్టాలని చెబుతున్నారు నిపుణులు.
అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో డిన్నర్ ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజులో మనం ఏమి తింటున్నామనేది ఎంత కీలకమో..ఏ సమయంలో తింటున్నామో అనేది కూడా కీలకమేనని చెబుతున్నారు. కొంతమంది డిన్నర్ పూర్తిగా మానేయాలని సూచిస్తున్నారు. కాగా, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకునే వారికి డైట్ గురు, రచయిత డాక్టర్ మైఖేల్ మోస్లీ అనువైన డిన్నర్ టైంను నిర్ధారించారు. రాత్రి 8 గంటలలోపు డిన్నర్ చేయాలని, ఆ తర్వాత ముద్దకూడా ముట్టొద్దని సూచించారు.
మోస్లీ ప్రకారం..పడుకునేటప్పుడు శరీరంలో కేలరీలు చేరకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో మన జీర్ణక్రియ మందగిస్తుంది.. దీంతో తిన్న ఆహారమంతా చాలాసేపు పొట్టలోనే ఉండిపోతుంది. రాత్రిపూట నూడుల్స్, పిజ్జాలు, చిప్స్, బిస్కెట్స్లాంటి అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటే ఓవర్‌నైట్ కేలరీ ఓవర్‌లోడ్‌కు దారితీస్తుంది. దీంతో బరువు పెరుగుతారు.
ఒక నిర్దిష్ట సమయం తర్వాత శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. జీర్ణక్రియ ప్రక్రియ గణనీయంగా మందగించడం వలన రాత్రిపూట తీసుకునే కొవ్వు, చక్కెర వ్యవస్థలో శరీరంలో ఎక్కువసేపు ఉంటుంది. ఇది సహజ శరీర గడియారానికి కూడా ఆటంకం కలిగిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. సిర్కాడియన్ రిథమ్ అనేది 24-గంటల చక్రాలను సూచిస్తుంది. ఇది శరీరానికి ఎప్పుడు నిద్రపోవాలి అనేది రోగనిరోధక కణాలు అత్యంత చురుకుగా ఉన్నప్పుడు తెలియజేస్తుంది.
2017 అధ్యయనం ప్రకారం, అధిక బరువు ఉన్నవారు నిద్రపోవడానికి కొద్దిసేపటి ముందు మెలటోనిన్ స్థాయిలు ఎక్కువగా ఉన్న సమయంలో ఎక్కువ ఆహారం తీసుకునేందుకు ఇష్టపడతారు. దీంతో జీవగడియారానికి ఆటంకం ఏర్పడి బరువు పెరుగుతుంటారు. మరో 250 అధ్యయనాలను విశ్లేషించినప్పుడు మధ్యాహ్నం మూడు గంటలలోపు భోజనం ముగించేయడం ఉత్తమమని తేలింది. ఆ సయయంలో జీర్ణక్రియ, రక్తంలో చక్కెర స్థాయిలు, చురుకుదనం ఉత్తమంగా ఉంటాయి. మెటబాలిజం మెరుగై బరువు అదుపులో ఉంటుందని గుర్తించారు.