Cortisol Face | ముఖం అకస్మాత్తుగా గుండ్రంగా, ఉబ్బినట్లుగా కనిపించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో కార్టిసోల్ ఫేస్ గా ట్రెండ్ అవుతోంది. అయితే ఇది వైద్యపరమైన అధికారిక పదం కాదు. శరీరంలో కార్టిసోల్ హార్మోన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు కొవ్వు పంపిణీలో మార్పులు, శరీరంలో నీరు నిల్వ ఉండటం వంటి కారణాలతో ముఖం ఉబ్బినట్లుగా కనిపించే అవకాశం ఉంటుంది. సాధారణ రోజువారీ ఒత్తిడి వల్ల కనిపించే స్వల్ప ముఖ వాపును నిజమైన కార్టిసోల్ ఫేస్ గా భావించకూడదు. కార్టిసోల్ అంటే ప్రతి కిడ్నీ పైన ఉండే అడ్రినల్ గ్రంథులు ఉత్పత్తి చేసే ముఖ్యమైన హార్మోన్. శరీరంలో మెటబాలిజం, రోగనిరోధక వ్యవస్థ స్పందన, రక్తపోటు, ఒత్తిడికి శరీరం స్పందించే విధానం వంటి అనేక ప్రక్రియల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఒత్తిడి సమయంలో కార్టిసోల్ స్థాయిలు పెరగడం సహజం. అయితే ఎక్కువ కాలం కార్టిసోల్ స్థాయిలు అధికంగా ఉండటం వల్ల బరువు పెరగడం, నిద్ర సమస్యలు, ఆందోళన లేదా డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు, రోగనిరోధక శక్తి బలహీనపడటం, జీర్ణ సమస్యలు, ఎముకల ఆరోగ్యం దెబ్బతినడం వంటి ప్రభావాలు కనిపిస్తాయి.
కార్టిసోల్ ఫేస్ అనే పదంతో సాధారణంగా ముఖం గుండ్రంగా, ఉబ్బినట్లుగా, వాపు వచ్చినట్లుగా కనిపించే పరిస్థితిని సూచిస్తారు. అధిక కార్టిసోల్ స్థాయిలతో శరీరంలో కొవ్వు పంపిణీ మారడం, ద్రవం నిల్వ కావడం దీనికి కారణాలుగా చెబుతుంటారు. తీవ్రమైన, దీర్ఘకాలికంగా అధిక కార్టిసోల్ ఉండే పరిస్థితుల్లో, ముఖ్యంగా ప్రిస్క్రిప్షన్ స్టెరాయిడ్ల వాడకం లేదా కుషింగ్స్ సిండ్రోమ్ వంటి అరుదైన పరిస్థితుల్లో మూన్ ఫేస్ కనిపిస్తుంది. శరీరంలో కార్టిసోల్ ఎక్కువగా ఉన్నప్పుడు ముఖంపై అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కొవ్వు ఉత్పత్తి పెరగడంతోపాటు అది శరీరంలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా నిల్వ అవుతుంది. ముఖంలోని పై బుగ్గలు, దవడ చుట్టుపక్కల, ముఖం పక్కభాగాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల ముఖం మరింత గుండ్రంగా కనిపిస్తుంది. అధిక కార్టిసోల్ మూత్రపిండాలు ఎక్కువ సోడియంను తిరిగి శరీరంలోకి తీసుకునేలా ప్రభావితం చేస్తాయి. సోడియం పెరిగినప్పుడు శరీరంలో ద్రవం నిల్వ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ముఖంలోని మృదువైన కణజాలాల్లో నీరు పేరుకుని వాపు కనిపిస్తుంది.
కార్టిసోల్ కొల్లాజెన్, ఎలాస్టిన్ వంటి ప్రోటీన్లపై కూడా ప్రభావం చూపుతుంది. ఇవి చర్మానికి బలం, స్థితిస్థాపకతను అందించే ముఖ్యమైన పదార్థాలు. ఇవి తగ్గడం వల్ల చర్మం పలుచగా, బలహీనంగా మారి ముఖంలో పేరుకున్న కొవ్వు, ద్రవం మరింత స్పష్టంగా కనిపిస్తాయి. అధిక కార్టిసోల్ స్థాయిలు చర్మంలో నూనె ఉత్పత్తిని కూడా పెంచుతాయి. దీంతో రంధ్రాలు మూసుకుపోవడం, ఒత్తిడికి సంబంధించిన మొటిమలు రావడం, ముఖం ఎర్రబడటం లేదా వేడిగా కనిపించడం వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కార్టిసోల్ ఫేస్ ను తగ్గించడానికి ఒక్క క్రీమ్ లేదా తక్షణ పరిష్కారం ఉండదు. శరీరంలో కార్టిసోల్ ఎందుకు పెరుగుతుందో గుర్తించి, దానికి సంబంధించిన కారణాలను నియంత్రించడం ముఖ్యం. రోజువారీ జీవితంలో ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు, యోగా, తైచీ వంటి పద్ధతులను ప్రయత్నించవచ్చు. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా కార్టిసోల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు నిరంతరం చాలా కఠినమైన, అలసటకు గురిచేసే వ్యాయామాలు చేయడం మంచిది కాదు. వీటికి బదులుగా నడక, యోగా లేదా తగిన విశ్రాంతితో వెయిట్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలను ఎంచుకోవచ్చు. నిద్రకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతిరోజూ 7 నుంచి 9 గంటల పాటు అంతరాయం లేని నిద్ర పొందడం శరీరానికి ఎంతో అవసరం. గాఢమైన నిద్ర కార్టిసోల్ స్థాయిలను సహజంగా నియంత్రించడంలో, శరీర కణజాలాల పునరుద్ధరణలో సహాయపడుతుంది. ఆహారంలో పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి సంపూర్ణ ఆహారాలను చేర్చుకోవడం మంచిది. అధికంగా చక్కెర, ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఉప్పు తగ్గించడం వల్ల శరీర కణజాలాల్లో నీరు అధికంగా నిల్వ ఉండే అవకాశం తగ్గుతుంది. అలాగే చక్కెరను పరిమితం చేయడం వల్ల ఇన్సులిన్ స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
తగినంత నీరు తాగడం కూడా ముఖ్యం. శరీరంలో నీరు సరిపడా ఉన్నప్పుడు మూత్రపిండాలు సమర్థవంతంగా పనిచేసి అదనపు సోడియం, వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. దీంతో నీరు నిల్వ కావడం వల్ల ఏర్పడే కణజాల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఒత్తిడి అదుపులోకి రాకుండా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటే మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఒత్తిడిని నియంత్రించడం, మంచి నిద్ర, క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య ఆహారం, తగినంత నీరు వంటి జీవనశైలి మార్పులు కార్టిసోల్ స్థాయిలను నిర్వహించడంలో, దానికి సంబంధించిన కొన్ని శారీరక ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి.