మేడమ్! నా వయసు యాభై రెండు. మెనోపాజ్ వచ్చి రెండేండ్లు దాటుతున్నది. ఈ దశలో స్త్రీలు రకరకాల స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయించుకోవాలని ఎక్కడో చదివాను. నిజమేనా? అసలు, నేను ఎలాంటి టెస్ట్‌లు చేయించుకోవాలి?
-ఓ సోదరి
సాధారణంగా ముప్పై అయిదేండ్లు దాటిన ప్రతి స్త్రీ ఏడాదికి ఒకసారైనా గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. తన ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలి. ఇందులో భాగంగా మమోగ్రామ్, పాప్ స్మియర్ టెస్ట్ తప్పక చేయించు కోవాలి. నిజానికి, నలభై దాటకుండా పాప్ స్మియర్ టెస్ట్ చేయరు.అందుకే సోనో పాప్ స్మియర్.. అంటే అల్ట్రా సౌండ్ పద్ధతిలో పాప్ స్మియర్ చేయించుకోవచ్చు. తర్వాత బీపీ, షుగర్‌తోపాటు బ్లడ్ టెస్ట్‌లు చేయించు కోవాలి. కుటుంబంలో ఎవరికైనా పెద్ద పేగు క్యాన్సర్ ఉంటే కొలనోస్కోపీకి వెళ్లడం ఉత్తమం. ఇవే కాకుండా.. వివిధ క్యాన్సర్ల ఆనవాళ్లను పసిగట్టేందుకు క్యాన్సర్ జెనెటిక్స్ పరీక్ష చేస్తారు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. స్తోమతను బట్టి ఈ పరీక్ష కూడా చేయించుకుంటే, రాబోయే క్యాన్సర్లను ముందుగా గుర్తించవచ్చు. అంతే కాదు, ఏ అనారోగ్య లక్షణాన్నీ నిర్లక్ష్యం చేయకూడదు.
మహిళా పాఠకులు తమ ఆరోగ్య సమస్యలను zindagi@ntnews.comకు మెయిల్ చేయవచ్చు.
-డాక్టర్ పి. బాలాంబ
సీనియర్ గైనకాలజిస్ట్