ఎముక నిర్మాణంలో క్యాల్షియం ఎంత ముఖ్యమో విటమిన్ డి అంతే అవసరం. ఇవి రెండు సరిపోయేంత ఉంటేనే ఎముకలు పటిష్టంగా ఉంటాయి. ఆహారం ద్వారా శరీరంలోకి చేరిన క్యాల్షియం ఎముకకు చేరాలంటే విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. క్యాల్షియంను ఎముకకు చేర్చే క్రమంలో విటమిన్ డి ఒక వాహకంలా పనిచేస్తుంది. విటమిన్ డి తగినంత లేకుంటే ఆహారం, సప్లిమెంట్స్ ద్వారా ఎంత క్యాల్షియం తీసుకున్నా వ్యర్థమవుతుంది.
నిజానికి మన చర్మంలో విటమిన్ డి క్రియారహిత రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే సూర్యరశ్మి తగులుతుందో అప్పుడు డి విటమిన్ యాక్టివ్ అవుతుంది. అందుకే ప్రతి రోజు ఉదయం పూట కనీసం గంట సేపు ఎండ తగిలేలా చూసుకోవాలి. మారిన జీవనశైలి కారణంగా విటమిన్ డి లోపాన్ని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారు సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవచ్చు. వైద్యుల సూచన మేరకు క్యాల్షియం, విటమిన్ డి మందులు వాడొచ్చు.