ఎముకల బలానికి విటమిన్ డి ఎంతో అవసరం. వ్యాధి నిరోధకతకు ఇది చాలా ముఖ్యం. శరీర ఆరోగ్యంపట్ల అవగాహన మంచిదే. కానీ, అది ఆచరణలో సరిగా లేకపోతే ముంచడం ఖాయం. ఎందుకంటే ఇటీవల ఎవరికి వారుగా విటమిన్ డి క్యాప్సుల్స్ తీసుకుంటున్నారు. అవసరమైనంత మేరకే విటమిన్ డి క్యాప్సుల్స్ ప్రాణాధారంగా పనిచేస్తాయి. ఇమ్యూనిటీ బూస్టర్‌గా ఉపయోగపడతాయి. మోతాదు మించితే అదే విషమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
శరీరంలో విటమిన్ డి లోపం లేకపోయినా, దానికి సంబంధించిన సప్లిమెంట్స్ కొంతకాలం తీసుకుంటే.. గుండె ఆరోగ్యం క్షీణిస్తుందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. అలాగే అదనంగా వచ్చి చేరిన డి విటమిన్ వల్ల కిడ్నీలపై భారం పడుతుంది. వాటి పని తీరు తగ్గిపోయి ఫెయిల్యూర్‌కి దారితీయొచ్చు. కాబట్టి సొంతంగా విటమిన్ డి క్యాప్సుల్స్ తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు.
డాక్టర్లు చెబితేనే, అదీ వారు సూచించిన మోతాదులోనే తీసుకోవాలని సూచిస్తున్నారు. గర్భిణులు, స్త్రీలు రక్త పరీక్షలు చేయించుకోకుండానే విటమిన్ డి, క్యాల్షియం కాంబినేషన్ సప్లిమెంట్లు తీసుకుంటున్నారు. దీనివల్ల ఆరోగ్యం సిద్ధించకపోగా, అనారోగ్యం పలకరిస్తుందని మర్చిపోకండి! వైద్యుణ్ని సంప్రదించిన తర్వాతే.. మందైనా, మాకైనా అని గుర్తుంచుకోండి.