Vitamin B9 | విటమిన్ బి9.. దీన్నే ఫోలిక్ యాసిడ్ అని కూడా అంటారు. సాధారణంగా గర్భంతో ఉన్న మహిళలకు మాత్రమే ఈ విటమిన్ ఎక్కువగా అవసరమని అందరూ భావిస్తారు. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాలను తింటే గర్భంలో ఉన్న శిశువు ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. అవయవాలు సరిగ్గా నిర్మాణం అవుతాయి. పుట్టుక లోపాలు రాకుండా నివారించవచ్చు. కనుకనే గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాలను తినాలని చెబుతుంటారు. అలాగే ఆ ట్యాబ్లెట్లను కూడా వేసుకోవాలని డాక్టర్లు ఇస్తుంటారు. అయితే వాస్తవానికి ఫోలిక్ యాసిడ్ కేవలం గర్భిణీలకే కాదు, అందరికీ అవసరమే. మన శరీరానికి ఉపయోగపడే అనేక విటమిన్లలో విటమిన్ బి9 కూడా ఒకటి. ఇది అనేక జీవక్రియలను నిర్వహిస్తుంది.
ఫోలిక్ యాసిడ్ మన శరీరంలో తనంతట తానుగా తయారు కాదు. దీన్ని బయటి నుంచి తీసుకోవాలి. కనుక విటమిన్ బి9 ఉండే ఆహారాలను తినాలి. మన శరీరంలో ఎప్పటికప్పుడు శక్తి స్థాయిలను నిర్వహించడంలో విటమిన్ బి9 ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే ఈ విటమిన్ ఉండే ఆహారాలను తింటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగు పడుతుంది. వెన్నెముక దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. నాడీ సంబంధ సమస్యలు తగ్గుతాయి. పిల్లల్లో ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటే రక్తహీనత వస్తుంది. శారీరకంగా ఎదుగుదల కూడా ఉండదు. ఈ లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు వెంటనే అలర్ట్ అవ్వాలి. డాక్టర్చే పరీక్షలు చేయించి అవసరం అయినంత మేర మందులను వాడాలి.
ఫోలిక్ యాసిడ్ లోపం టీనేజీ ఆడపిల్లల్లో ఉంటే వారికి సంతానం కలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. గర్భధారణలో సమస్యలు తలెత్తుతాయి. 30 ఏళ్లు దాటిన వారిలో ఫోలిక్ యాసిడ్ లోపిస్తే ఎముకలు గుల్లబారి పెళుసుగా మారుతాయి. త్వరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే గుండె జబ్బులు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి. కనుక కేవలం గర్భిణీలే కాదు, అందరూ విటమిన్ బి9 తగ్గకుండా చూసుకోవాలి. విటమిన్ బి9 మనకు పలు ఆహారాల్లో లభిస్తుంది. విటమిన్ బి9 లోపిస్తే రక్తహీనత, విరేచనాలు, తెల్ల రక్త కణాల సంఖ్య తక్కువగా ఉండడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. చర్మం పాలిపోయి ఉంటుంది. బరువు తగ్గుతారు. త్వరగా అలసిపోతారు. బాగా నీరసంగా కూడా ఉంటుంది.
ఫోలిక్ యాసిడ్ మనకు రోజుకు 100 మైక్రోగ్రాముల మేర అవసరం అవుతుంది. గర్భిణీలకు అయితే 400 నుంచి 500 మైక్రోగ్రాముల వరకు ఫోలిక్ యాసిడ్ అవసరం. టీనేజ్లో ఉన్నవారికి రోజుకు 200 మైక్రోగ్రాముల మేర విటమిన్ బి9 అవసరం అవుతుంది. విటమిన్ బి9 మనకు మటన్ లివర్, మాంసం, గుడ్లు, పాలు, పండ్లు, ధాన్యాలు తదితరాల్లో అధికంగా లభిస్తుంది. పాలకూరలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. అలాగే తోటకూర, చుక్కకూర, బీన్స్, చిక్కుడు జాతి గింజలు, పప్పు ధాన్యాలు, నారింజ పండ్లు, నిమ్మజాతి పండ్లు, బీట్రూట్, పొద్దు తిరుగుడు విత్తనాలు, పల్లీలు, పుట్టగొడుగులు, బొప్పాయి పండ్లు, క్యారెట్లు, పచ్చి బఠానీలు, చేపలు, పాలు, పైనాపిల్, అరటి పండు, మొక్కజొన్న, క్యాబేజీ, టోఫు వంటి వాటిల్లో మనకు ఫోలిక్ యాసిడ్ అధికంగా లభిస్తుంది. ఈ ఆహారాలను తరచూ తింటే ఫోలిక్ యాసిడ్ లోపం ఏర్పడకుండా చూసుకోవచ్చు.