మంచి ఆహారం, రాత్రులు మంచినిద్ర తర్వాత కూడా కొంతమందిలో ఉదయం బద్ధకం, ఒత్తిడి, కుంగుబాటు, రోజంతా అలసిపోయిన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అత్యవసరమైన విటమిన్లు, కొన్ని పోషకాలు అందకపోతే ఇలా జరుగుతుంది. సాధారణంగా ఇలాంటి లక్షణాలు విటమిన్-బి12 లోపం వల్ల తలెత్తుతూ ఉంటాయి. సమస్యకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.
విటమిన్ బి12 లోపం వల్ల నాడీ వ్యవస్థ, మెదడు బాగా ప్రభావితం అవుతాయి. ఈ విటమిన్ లోపించినప్పుడు ఎర్ర రక్తకణాలు తగ్గిపోతూ ఉంటాయి. దీంతో రక్తహీనత (ఎనీమియా) ముప్పు పెరుగుతుంది.దీంతో అలసట, బలహీనత, కుంగుబాటు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.
జ్ఞాపకశక్తి క్షీణత: విటమిన్ బి12 లోపం మెదడుపై పెద్ద ప్రభావాన్నే చూపుతుంది. ఇది జ్ఞాపకశక్తి క్షీణత, వృద్ధాప్యంలో డెమెన్షియా ముప్పును పెంచుతుంది. శారీరక, మానసిక అనారోగ్యాలు పెరుగుతాయి.
రక్తహీనత: రక్తహీనత, రక్త నష్టం, హిమోగ్లోబిన్ స్థాయులు పడిపోవడం సంభవిస్తాయి.
ఎముకల్లో నొప్పి: విటమిన్ బి12 తక్కువవడం వల్ల ఎముకల నొప్పి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా నడుము, వెన్నులో నొప్పి కూడా పీడిస్తుంది. నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం: విటమిన్ బి12 లోపం తలెత్తినప్పుడు మన శరీరంలో ఉన్న మొత్తం నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం పడుతుంది. రక్తం శరీరంలోని అన్ని భాగాలకు సవ్యంగా సరఫరా కాకపోవడంతో జీవితకాలం పట్టిపీడించే వ్యాధులు కూడా రావొచ్చు.