Turmeric For Weight Loss | పసుపును మనం రోజూ వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. దీన్ని రోజూ కూరల్లో వేస్తుంటారు. పసుపు వల్ల కూరలకు చక్కని రంగు, రుచి వస్తాయి. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. అందుకనే పసుపును అనేక విధాలుగా కూడా ఉపయోగిస్తారు. గాయాలు, పుండ్లు అయినప్పుడు పసుపును రాస్తుంటే అవి త్వరగా మానుతాయి. మహిళలు పసుపుతో ఫేస్ ప్యాక్‌లను తయారు చేసి ఉపయోగిస్తుంటారు. దీని వల్ల ముఖం అందంగా మారి కాంతివంతంగా ఉంటుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. పసుపు కలిపిన పాలను తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే అధిక బరువు తగ్గేందుకు కూడా పసుపు పనిచేస్తుంది. దీన్ని పలు పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు.
పసుపుతో టీ తయారు చేసి తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగి బరువును తగ్గించుకోవచ్చు. పసుపు టీ తయారు చేసేందుకు గాను 1 కప్పు వేడి నీళ్లు, 1 టీస్పూన్ పసుపు, చిటికెడు మిరియాల పొడి, అర చెక్క నిమ్మరసం, తేనె రుచికి సరిపడా తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా వేడి నీటిలో పసుపు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి కలపాలి. 2 నిమిషాల పాటు అలాగే ఉంచిన తరువాత తేనె వేసి తిరిగి మళ్లీ ఆ నీళ్లను కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఈ పసుపు టీని ఉదయం పరగడుపున తాగాల్సి ఉంటుంది. దీంతో శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అలాగే పాలలో పసుపు కలిపి తాగడం వల్ల కూడా బరువును తగ్గించుకోవచ్చు. అందుకు గాను ఒక కప్పు గోరు వెచ్చని పాలలో 1 టీస్పూన్ పసుపు, చిటికెడు మిరియాల పొడి, 1 టీస్పూన్ అల్లం రసం, 1 టీస్పూన్ కొబ్బరినూనె లేదా నెయ్యి, కాస్త తేనె వేసి కలిపి వాటిని రాత్రి పూట నిద్రకు ముందు తాగాలి. దీని వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మలబద్దకం ఉండదు. అధిక బరువు తగ్గుతారు.
పసుపు, అల్లం రసం కలిపి తీసుకోవడం వల్ల కూడా అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఒక కప్పు కొబ్బరిపాలు లేదా బాదంపాలు, 1 టీస్పూన్ పసుపు, అర ఇంచు అల్లం ముక్క, ఒకటి లేదా రెండు అరటి పండు ముక్కలు, చిటికెడు మిరియాల పొడి, కొద్దిగా పాలకూర తీసుకోవాలి. అన్నింటినీ మిక్సీలో వేసి స్మూతీలా తయారు చేయాలి. దీన్ని రోజులో ఎప్పుడైనా సరే తాగవచ్చు. ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల కూడా శరీర మెటబాలిజం పెరిగి బరువు తగ్గుతారు. ఆరోగ్యంగా ఉంటారు. అలాగే రోజూ ఒక కోడిగుడ్డును ఉడకబెట్టి దానిని సగానికి కట్ చేసి దానిపై కొద్దిగా పసుపు, మిరియాల పొడి చల్లి తింటుండాలి. ఇలా చేస్తున్నా కూడా బరువు తగ్గుతారు. మీరు తాగే సూప్‌లు, సలాడ్స్‌పై కూడా పసుపు చల్లి తీసుకోవచ్చు. దీని వల్ల కూడా శరీరంలోని కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.
పసుపును ఈ విధంగా తీసుకోవడం వల్ల అధిక బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది. అయితే పసుపును రోజుకు 2 నుంచి 4 గ్రాములకు మించకుండా తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. మార్కెట్లో పసుపు నుంచి తయారు చేసే కర్క్యుమిన్ ట్యాబ్లెట్లు కూడా లభిస్తాయి. కానీ వైద్యుల పర్యవేక్షణలో వీటిని వాడాల్సి ఉంటుంది. అయితే పసుపును ఎప్పుడు తీసుకున్నా దాన్ని మిరియాల పొడితో కలిపి తీసుకుంటే మేలు చేస్తుంది. ఎందుకంటే పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే సమ్మేళనం వల్లే మనం బరువు తగ్గుతాము. ఇది మన శరీరానికి ఎక్కువగా లభించాలంటే అందుకు మిరియాల పొడి సహాయం చేస్తుంది. కనుక పసుపును ఎల్లప్పుడూ మిరియాల పొడితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కర్క్యుమిన్ సమ్మేళనం కొవ్వులో కరుగుతుంది. కనుక పసుపును ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె, నెయ్యితో తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. ఇలా పసుపును తీసుకోవడం వల్ల బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.