Organ Donation Day | ‘పరోపకారార్థమిదం శరీరమ్..’ అన్నది పెద్దల మాట. అంటే.. ఈ శరీరాన్ని పరోపకారం కోసం ఉపయోగించాలని అర్థం. ఇతరులు కోలుకోలేనంత కష్టంలో ఉన్నప్పుడు తోటి వారు స్పందించి చేతనైనంత మేర ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని, విద్యాదానం గొప్పదని.. ఇలా సందర్భానుసారంగా చెప్తుంటాం. అయితే, ఏనాటికైనా మారని గొప్ప దానం ఒకే ఒక్కటి.. అదే ప్రాణదానం. ప్రాణదానం చేయడంలో ముఖ్య పాత్ర పోషించేది అవయవదానమే అని గుర్తుంచుకోవాలి. ఇవాళ ప్రపంచ అవయవదానం దినోత్సవంను పురస్కరించుకుని ప్రత్యేక కథనం.
వైద్య శాస్త్రంలో అందిన ఆధునికత కారణంగా మన వైద్యులు ఎన్నో రకాల అవయవాలను మార్చి ప్రాణాలను నిలబెడుతున్నారు. దేశవ్యాప్తంగా, మన రాష్ట్రంలో ఎందరో అవయవ దాతల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మనలో అవయవ దానంపై అవగాహన లేకపోవడమే. రోడ్డు ప్రమాదాల్లో జీవన్మరణ స్థితిలో ఉన్నప్పుడు అవయవాలను దానం చేసి మరి కొందరికి ప్రాణం పోయవచ్చుననే కనీస విషయాన్ని మరిచిపోతుంటాం.
అలా చేయడం సంస్కృతి కాదని, ఆచారం కాదని మరికొందరు కొట్టిపారేస్తుంటారు. ఫలితంగా అవయవ దాతల కోసం ఏండ్ల తరబడిగా ఎదురుచూస్తున్న ఎందరో ప్రాణదాతల కోసం విలవిల్లాడుతుంటారు. బ్రెయిన్‌డెడ్ వ్యక్తుల నుంచి అవయవాలను సేకరించే అవకాశం కల్పించేలా మనం చట్టబద్ధమైన మార్గదర్శకాలను తయారుచేసుకున్నాం. అయితే, ప్రజల్లో ఇంకా అపోహలు వీడకపోవడంతో చట్టాలు నిష్ప్రయోజనమవుతున్నాయి.
బ్రెయిన్‌డెడ్ అంటే..
ఏదైనా ప్రమాదం జరిగిన సందర్భాల్లో తలకు తీవ్రమైన గాయమై మెదడు పనితీరు నిలిచిపోయినా.. శరీరం కొంత సేపు పనిచేస్తుంది. ఎట్టిపరిస్థితుల్లో రోగి బ్రతికే అవకాశాలు లేవు. ఇదే బ్రెయిన్ డెడ్. ఇలాంటి వ్యక్తుల నుంచి గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, కండ్లు, చర్మం.. ఇలా అవయవాలను సేకరించి అవసరమైన వారికి దానం చేయడం ద్వారా వారిని బ్రతికించిన వారం అవుతాం.
ఇలా అవయవ దానం చేసేందుకు ఎలాంటి అర్హతలు అవసరం లేదు. అర్హమైన అవయవాలు ఉంటే సరిపోతుంది. మన వారు ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో చనిపోతే.. వెంటనే జీవన్‌దాన్ సంస్థకు తెలియజేస్తే.. మనం దానం చేసే అవయవాల ద్వారా కనీసం మరో 8 మందికి ప్రాణం పోసే అవకాశాలు ఉంటాయి.
వయసు పరిమితి
మూత్రపిండాలు, కాలేయం – 70 ఏండ్ల వయసు వరకు
గుండె, ఊపిరితిత్తులు – 50 ఏండ్ల వయసు వరకు
క్లోమం, పేగు – 60-65 సంవత్సరాల వరకు
కార్నియా, చర్మం – 100 ఏండ్ల వరకు
గుండె కవాటాలు – 50 సంవత్సరాల వరకు
ఎముకలు – 70 ఏండ్ల వరకు దానం చేయవచ్చు.
దాతగా నిలువాలంటే..?
జీవించి ఉన్న దాత : 18 ఏండ్ల వయసు నిండిన వారు ఎవరైనా స్వచ్ఛందంగా జీవితకాలంలో తన అవయవాలు లేదా కణజాలం తీసుకొనేందుకు అనుమతించవచ్చు.
మరణించిన దాత : ఎవరైనా, ఏ వయసు వారైనా, జాతి, లింగం బేధం లేకుండా అవయవాలను దానం చేయవచ్చు. మృతుల కుటుంబసభ్యులు గానీ, సమీప బంధువుగానీ తమ సమ్మతిని తెలియజేస్తూ ప్రభుత్వానికి తెలియజేయాలి. మరణించిన దాత 18 ఏండ్ల కన్నా చిన్న వారైతే అప్పుడు తల్లిదండ్రులు లేదా వారి ద్వారా అధికారం పొందిన మరో వ్యక్తి సమ్మతి తెలియజేయవచ్చు.
అవయవ దానంకు సంబంధించి మానవ అవయవాల చట్టంను 1994 న పార్లమెంట్ ఆమోదించింది. 2011 లో మానవ అవయవాల మార్పిడి (సవరణ) చట్టం వచ్చింది. 2014 లో మానవ అవయవాలు, కణజాలం మార్పిడి నియమాలను రూపొందించారు. ఇవన్నీ మనం అపోహలను దూరం చేసుకుని ఇతరులకు ప్రాణదానం చేసేందుకే.
ప్రస్తుతం అవయవాల అవసరం ఉన్నవారు ఎక్కువగానూ, వాటి లభ్యత తక్కువగానూ ఉన్నందున జీవన్‌దాన్ కార్యక్రమం నెట్‌వర్క్‌తో అనుసంధానమైన దవాఖానలకు రొటేషన్ పద్ధతిలో రోగికి అవయవాలు అందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఎందరో బ్రెయిన్‌డెడ్‌కు గురవుతున్నా.. అవయవాల దానానికి వారి కుటుంబీకులు ముందుకు రావడం లేదు. మనకే ఈ పరిస్థితి వస్తే అనే రీతిన ఆలోచిద్దాం.. అవయవదానం చేసేందుకు పదం కలుపుదాం.