జలుబు.. శ్వాసనాళం పైభాగంలో వైరస్ అటాక్ చేయడం వలన కలిగే జబ్బే జలుబు. దీనినే మనం పడిసం, రొంప అని కూడా పిలుచుకుంటుంటాం. సీజన్లు మారినప్పుడు.. అలర్జీలు ఉన్నవారికి.. శీతలపానీయాలు పడని వారికి.. ఇంకా అనేక రకాల కారణాల వల్ల అనేక మంది జలుబు చేస్తుంటుంది. జలుబు చేసిందంటే చాలు కళ్లు ఎరుపెక్కుతాయి. తుమ్ములు, దగ్గు వస్తుంది. గొంతు వాపు కనిపిస్తుంది. ముక్కు కారుతుంది. శ్వాస పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఏ పనిచేయాలన్ని అన్ఈజీగా ఉంటుంది. ఈ జలుబు తగ్గాలంటే ఎలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. జలుబు వస్తే ఒక పట్టాన తగ్గదు. అయితే కింద సూచించిన పలు ఆహార పదార్థాలను తీసుకుంటే జలుబును త్వరగా తగ్గించుకోవచ్చు. అవేమిటంటే…
* గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గ్రీన్ టీని తాగితే శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములు, బాక్టీరియా, వైరస్లు నశిస్తాయి. దీంతో జలుబు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. నిత్యం 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీని తాగడం వల్ల జలుబును తగ్గించుకోవచ్చు.
* వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల పూటకు ఒకటి చొప్పున వెల్లుల్లి రెబ్బను తింటుంటే జలుబు త్వరగా తగ్గుతుంది.
* నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు జలుబును త్వరగా తగ్గిస్తాయి.
* పుట్టగొడుగులు మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో జలుబుకు కారణమయ్యే వైరస్ల ప్రభావం తగ్గి, జలుబు తగ్గుతుంది.
* పసుపు, అల్లం రసం, గుమ్మడికాయ విత్తనాలు, క్యారెట్లు, చికెన్ సూప్ తీసుకోవడం వల్ల కూడా జలుబును త్వరగా తగ్గించుకోవచ్చు.
* మిరియాలు, బెల్లం, పెరుగు కలిపి తీసుకుంటే ముక్కు దిబ్బద త్వరగా తగ్గి జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
* జాజికాయ పొడి, అల్లం, కుంకుమ పువ్వును పాలల్లో వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుది.
* చింతపండు గుజ్జు, టమాట రసం, మిరియాల పొడి, ఒక ఎండు మిర్చి, కొంచెం ఉప్పు కలిపి సూప్ మాదిరిగా చేసుకుని వేడివేడిగా తాగితే జలుబు ముక్కు కారడం ఆగుతుంది.
* జలుబు చేసినప్పుడు సాధారణంగా నీటిని అలానే తాగకూడదు.. వేడి చేసి తాగాలి.
* వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
* తులసి ఆకులు, రాక్ సాల్ట్ కలిపి నమిలి రసాన్ని మింగడం వల్ల జలుబు తగ్గుతుంది.
* ఉల్లిపాయ రసంలో నిమ్మకాయ పిండుకుని తీసుకున్నా జలుబు నుంచి మంచి ఉపశమనం పొందవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
* జలుబు చేసినప్పుడు విశ్రాంతి తీసుకోవడం మంచిది. అలా కాకుండా పని చేయడం, ఆఫీసులకు వెళ్లడం చేస్తే జలుబు ఎక్కువ అవుతుంది.
* జలుబు ఉన్నప్పుడు కర్చీఫ్ని వెంట తీసుకెళ్లాలి. దగ్గు, తుమ్ములు వేధిస్తున్నప్పుడు కర్చీఫ్ని అడ్డు పెట్టుకోవాలి.
* జలుబుకి పాటించే చిట్కాలు.. అందరికీ ఒకేలా ఉండవు. వయసుని బట్టి ఉంటాయి. పెద్దలు వాడే చిట్కాలే చిన్నవారిపై ప్రయోగించకూడదు.
* చల్లని ప్రదేశంలో అస్సలు ఉండకూడదు. దీని వల్ల జలుబు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
* ఏసీల కింద ఉండడం, పనిచేయడం చేయొద్దు.
* జలుబు ఉన్నప్పుడు రాత్రి సమయాల్లో చల్లని పదార్థాలు తినకుండా చూసుకోవాలి.
* బ్రెడ్, బిస్కెట్స్, మైదా పిండితో చేసిన ఐటెమ్స్ తినకుండా ఉండటం మంచిది.
* ఐస్ క్రీమ్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిది.
* చల్లని వాతావరణంలో తిరగకుండా చూసుకోవాలి.
* తప్పనిసరి బయటకు వెళ్లాల్సి వస్తే చెవులని కవర్ చేసుకోవాలి.