Throat Pain Home Remedies | సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే చాలా మందికి అనేక శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, ఆస్తమా వంటి సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. వీటితోపాటు ముక్కు దిబ్బడ, సైనస్ వంటి సమస్యలు కూడా మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అయితే ఈ సమస్యలు కొందరికి చాలా రోజుల వరకు అలాగే ఉంటాయి. చల్లని వాతావరణంలో ఇవి మరింత ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇక కొందరు ఎల్లప్పుడూ శ్వాసకోశ సమస్యలతో సతమతం అవుతూనే ఉంటారు. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే చక్కని ఫలితం పొందవచ్చు. ఆయా సమస్యలు ఉన్నవారు ఇంగ్లిష్ మెడిసిన్లను దీర్ఘకాలం వాడడం మంచిది కాదు. కానీ పలు ఇంటి చిట్కాలను పాటిస్తే వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఆయా సమస్యలు మళ్లీ రాకుండా ఉంటాయి. ఇక శ్వాసకోశ సమస్యలను తగ్గించే ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో కాస్త ఉప్పు వేయాలి. అనంతరం ఆ నీళ్లను గొంతులో పోసుకుని పుక్కిలించాలి. తరువాత వేడి వేడి మసాలా టీ తాగాలి. యాలకులు, లవంగాలు, అల్లం, మిరియాలు వేసి పెట్టిన మసాలా టీని సేవిస్తుంటే ఎలాంటి శ్వాసకోశ సమస్యల నుంచి అయినా సరే ఉపశమనం లభిస్తుంది. ఆయా మసాలాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఫలితంగా శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. కనుక తరచూ ఈ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు ఈ రెండు చిట్కాలను పాటిస్తే వెంటనే ఉపశమనం పొందవచ్చు. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం మొత్తం కరిగిపోతుంది.
ఒక టీస్పూన్ తాజా అల్లం రసం, కొంచెం తేనె కలిపి ఖాళీ కడుపుతో ఉదయం తీసుకోవాలి. ఇది చక్కని ఔషధంగా పనిచేస్తుంది. గొంతు నొప్పి లేదా దగ్గు, జలుబు వంటి సమస్యలు ఉన్నవారు ఈ చిట్కాను పాటిస్తే ఫలితం ఉంటుంది. అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. తేనె సహజసిద్ధమైన యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. కనుక ఈ రెండింటి మిశ్రమం మంచి ఔషధంగా పనిచేసి ఆయా సమస్యలను తగ్గిస్తుంది. అవసరం అనుకుంటే ఇదే మిశ్రమాన్ని సాయంత్రం కూడా ఒకసారి తీసుకోవచ్చు. అదేవిధంగా ఒకగ్లాస్ గోరు వెచ్చని నీటిలో చిటికెడు మిరియాల పొడి కలిపి కూడా తీసుకోవచ్చు. మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. కనుక గొంతు నొప్పి, వాపుతోపాటు దగ్గు, జలుబు సమస్యల నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తాయి. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫాన్ని కరిగిస్తాయి.
కొద్దిగా మిరియాల పొడిని తేనెతో కలిపి రోజుకు మూడు పూటలా తీసుకుంటుంటే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ రెండింటిలో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు ఎలాంటి శ్వాస సంబంధిత సమస్యలను అయినా సరే తగ్గిస్తాయి. ఈ రెండింటి మిశ్రమాన్ని తీసుకున్న అనంతరం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగితే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. అదేవిధంగా రోజుకు రెండు సార్లు వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరానికి ఎంతో హాయి కలుగుతుంది. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం మొత్తం కరిగిపోతుంది. ఇలా పలు ఇంటి చిట్కాలను పాటించడం వల్ల గొంతు సమస్యలను తగ్గించుకోవడంతోపాటు దగ్గు, జలుబు నుంచి కూడా ఉపశమనాన్ని పొందవచ్చు.