Sugar | తీపి అధికంగా తినడం అన్నది శరీరానికి చేదు చేసే విషయం అని చాలా రోజుల నుంచీ మనకు తెలిసిందే. అయితే తరచూ చక్కెరలు తీసుకోవడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు అధికం అవుతాయని ఇటీవలి ఓ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా అధిక చక్కెరలు కలిపిన పానీయాలు తాగడం వల్ల గుండెపోటు, హృదయ వైఫల్యం, గుండె కొట్టుకోవడంలో తేడాల్లాంటి తీవ్ర సమస్యల బారిన పడతారని ఈ నివేదిక పేర్కొంది. స్వీడన్లోని లండ్ యూనివర్సిటీలో జరిగిన పరిశోధనలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. రెండు బృందాలుగా దాదాపు 70 వేల మందిని సుదీర్ఘకాలం పాటు పరిశీలించిన శాస్త్రవేత్తలు.. గుండె ఆరోగ్యాన్ని చక్కెరలు ఎలా ప్రభావితం చేస్తాయన్న అంశానికి సంబంధించి వివిధ ఆసక్తికర అంశాలను వెల్లడించారు.
తీపి ఎంత మోతాదులో తీసుకుంటున్నాం అన్నదే కాదు, ఏ రూపంలో, ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అన్నదీ ముఖ్యమేనని ఈ పరిశీలనలో బయటపడింది. ఇందుకోసం చక్కెరలు తీసుకునే విధానాన్ని మూడు రకాలుగా విభజించారు… ఏదైనా పదార్థంతో పాటు అద్దుకోవడానికి తేనె, పంచదారలాంటివి తీసుకోవడం, కేకులు, పేస్ట్రీల్లాంటివి తినడం, మూడోది యాడెడ్ షుగర్స్ ఉండే పానీయాలు తాగడం. ధమనుల సమస్యలు, గుండె కొట్టుకోవడంలో సమస్యలు, రెండు రకాల గుండెపోట్లు… ఇలా మొత్తం ఏడు రకాల హృదయ సంబంధ వ్యాధులను దీనికి సంబంధించి పరిగణనలోకి తీసుకున్నారు. ఈ మూడు రకాల చక్కెర వర్గాల్లో, పానీయాలు తీసుకునే వాళ్లలోనే గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చినట్టు వెల్లడైంది.
అయితే, అసలు స్వీట్లే తినక పోవడం అన్నది హృదయానికి అంత మేలు చేసే అంశం కాదని కూడా ఈ నివేదిక చెబుతున్నది. చిరుతిళ్లలాంటి వాటి ద్వారా ఓ మోస్తరు మోతాదులో చక్కెరలు తీసుకునే వాళ్లలో, అసలు స్వీట్ తినని వాళ్లతో పోలిస్తే గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉందట. అంటే మితంగా తీపి తినడం అన్నది హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఈ పరిశోధన చెబుతున్నది. మనుషుల్లోని వర్గం, జాతి, ప్రాంతం, ఆహారపు అలవాట్ల మీద కూడా ఈ ఫలితం ఆధారపడుతుందని వీళ్లు చెబుతున్నారు. అంటే, ఈ అధ్యయనం స్వీడన్ దేశానికి సంబంధించినది. అక్కడి వాళ్ల ఆరోగ్యాన్ని, ఆహారపు అలవాట్లను పరిగణనలోకి తీసుకుని దీన్ని నిర్ణయించారు. వేర్వేరు ప్రాంతాల వారికి ఫలితాలు కొంచెం వేరుగానూ ఉండొచ్చు. కానీ, చక్కెరకూ గుండె ఆరోగ్యానికీ స్పష్టమైన సంబంధం ఉందన్నది మాత్రం ఈ పరిశీలన ద్వారా వెల్లడైంది.