ఇంగ్లిష్లో అపెండిక్స్గా పిలిచే ఉండుకం ఓ అవశేష అవయవమనీ, దీనికంటూ ప్రత్యేకంగా
ఓ పని ఉండదనీ చెప్తారు. జంతు దశ నుంచి మనిషిగా మారుతున్న క్రమంలో మనలో మిగిలిపోయిందనీ చెప్తుంటారు. అయితే, తాజా అధ్యయనాలు దీన్ని సవాలు చేస్తున్నాయి. అందరూ అనుకుంటున్నట్టు ఉండుకం ఎందుకూ ఉపయోగపడని అవయవం కాదని అంటున్నాయి.
పొట్టలో పెద్దపేగు మొదలయ్యే చోట సీకమ్ అనే భాగానికి అనుబంధంగా ఉండేదే ఉండుకం. పొట్ట కుడిభాగంలో చిన్నగా గొట్టంలా రెండు నుంచి నాలుగు అంగుళాల పరిమాణంలో ఉంటుంది. 2013లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఉండుకం పొట్టకు మేలుచేసే బ్యాక్టీరియాకు నిలయమని తేలింది. అయితే, ఇన్ఫెక్షన్లు, జ్వరాలు, యాంటిబయాటిక్స్ వాడటం తదితర కారణాల వల్ల మంచి చేసే బ్యాక్టీరియా కూడా ఎంతోకొంత నశించిపోతుంది. దీంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఈ క్రమంలో రోగి కోలుకున్న తర్వాత మళ్లీ బ్యాక్టీరియా అభివృద్ధికి ఉండుకం తోడ్పడుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది.
ఒక్క పొట్టకు మేలుచేసే బ్యాక్టీరియా విషయంలో మాత్రమే కాదు, మన శరీర రోగ నిరోధక వ్యవస్థలో కూడా ఉండుకం కీలకపాత్ర పోషిస్తుందని ఈ పరిశోధన పేర్కొంటున్నది. ఇది మంచి బ్యాక్టీరియాకు ఆవాసంగా ఉండటంతోపాటు, రోగ నిరోధక శక్తిలో కీలకంగా ఉండే తెల్ల రక్తకణాల ఉత్పత్తిలోనూ దోహదపడుతుంది. కాబట్టి జీవితంలో పెద్దవాళ్లయ్యాక ఉండుకం ఎంతో ఆవశ్యకతను కలిగి ఉంటుందని ఈ పరిశోధన తెలిపింది. అంతేకాదు తీవ్రమైన విరేచనాల వ్యాధి అయిన డయేరియా వంటి ఇన్ఫెక్షన్ల తర్వాత పొట్టలో బ్యాక్టీరియాను వృద్ధి చెందించడంలో సాయపడుతుంది. అలా ఉండుకం నిరుపయోగమైనదిగా కాకుండా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ నిర్వహణలో తనవంతు పాత్ర పోషిస్తుంది.
అపెండిసైటిస్… ఉండుకంలో కలిగే ఇబ్బందికి సంబంధించిన సమస్య. తీవ్రమైన కడుపునొప్పి ముఖ్యంగా పొట్ట కుడిభాగంలో వస్తుంది, వికారం, వాంతులు, జ్వరం, ఆకలి కోల్పోవడం లాంటివి అపెండిసైటిస్ లక్షణాలు. దీనికి చికిత్స తీసుకోకపోతే, ఉండుకంలో పగుళ్లు వస్తాయి. ఫలితంగా పెరిటోనైటిస్ అనే తీవ్ర హానికరమైన ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సర్జరీ ద్వారా ఉండుకాన్ని తొలగించాల్సి వస్తుంది. ఇంకొన్ని సందర్భాల్లో ఉండుకంపై పుండు ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు డాక్టర్లు సర్జరీకి ముందు ఈ పుండులో చీమును తీసేస్తారు. మరిన్ని ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడతారు.
అపెండిసైటిస్ కారణంగా ఉండుకాన్ని తొలగించినప్పటికీ శరీరం ఎప్పట్లానే తన పని తాను చేసుకుపోతుంది. పొట్టకు మేలుచేసే బ్యాక్టీరియా పెంపుదల, రోగ నిరోధక వ్యవస్థకు ఉండుకం తోడ్పాటును అందించినప్పటికీ, ఇది లేకపోయినప్పటికీ స్పష్టమైన ఆరోగ్య సమస్యలైతే తలెత్తవు. అయితే, అపెండిసైటిస్ సర్జరీ తర్వాత రోగులు మొదట్లో సర్జరీ జరిగిన చోట నొప్పి, వికారం, పేగుల కదలికల్లో స్వల్ప మార్పులు లాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ త్వరగానే కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు.