Couple Intercourse | నా వయసు ఇరవై నాలుగు. పెండ్లయి ఐదు నెలలు కావస్తున్నది. కలయిక సమయంలో విపరీతంగా నొప్పి వస్తున్నది. ఇలా ఎందుకు జరుగుతుంది. నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి?
– ఓ పాఠకురాలు
కలయిక సమయంలో నొప్పి.. పెండ్లయిన కొత్తలో ఆడపిల్లలకు సహజం. మామూలుగా సంభోగానికి శరీరం సన్నద్ధం అయినప్పుడు యోని నుంచి కొన్ని ద్రవాలు స్రవిస్తాయి. కానీ ఇవి సరిగ్గా ఊరకపోతే లూబ్రికేషన్ ఉండదు. యోనిభాగం పొడిగా ఉంటుంది. అలాంటప్పుడు రతి జరిపితే నొప్పి వస్తుంది. సాధారణంగా కూడా పెళ్లయిన కొత్తలో యోని ఎక్కువ రాపిడికి గురి కావడం వల్ల ఇలా అవుతుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్లు కూడా ఉండొచ్చు. కాబట్టి, భార్యాభర్తలిద్దరూ దగ్గరలో ఉన్న గైనకాలజిస్టును సంప్రదించండి.
పెండ్లయిన తొలి నాళ్లలో ఇద్దరిలో ఎవరికైనా ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. మూత్రానికి వెళ్లేప్పుడు మంటగా ఉండటం, పదేపదే వచ్చినట్టు అనిపించడం సర్వసాధారణం. దీన్ని ‘హనీమూన్ సిైస్టెటిస్’ అంటారు. కలయిక సమయంలో వాడేందుకు లూబ్రికేషన్ ఆయింట్మెంట్లు సూచిస్తారు వైద్యులు. వాటిని కూడా వాడొచ్చు. ముందు మీ భర్తతో ఈ విషయాన్ని చర్చించండి. సమస్య తగ్గాలంటే ఆయన సహకారం కూడా అవసరమని గుర్తుంచుకోండి.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్