మన శరీర జీవక్రియలు సక్రమంగా సాగడంలో థైరాయిడ్ గ్రంధిది కీలకపాత్ర. పోషకాహార లోపం, మారిన జీవనశైలి వల్ల ఎంతోమంది థైరాయిడ్ సమస్యల బారినపడుతున్నారు. అందువల్ల థైరాయిడ్ ఆరోగ్యానికి అండగా నిలిచే కొన్ని రకాల పదార్థాలను మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఉసిరి: ఇందులో విటమిన్ సి ఎక్కువ. థైరాయిడ్ ఆరోగ్యానికి ఉసిరి గొప్ప ఉపకారి. ఇది వెంట్రుకలకు మంచి టానిక్ కూడా. చుండ్రును నివారిస్తుంది. కుదుళ్లను బలోపేతం చేస్తుంది. మాడుకు రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. అలా వెంట్రుకల పెరుగుదలకు దోహదపడుతుంది.
కొబ్బరి: థైరాయిడ్ రోగులకు కొబ్బరి ఉత్తమమైన ఆహారం. మందకొడిగా సాగే జీవక్రియల క్రమాన్ని కొబ్బరి మెరుగుపరుస్తుంది. ఇందులో మీడియం చైన్ ఫ్యాటీ ఆమ్లాలు (ఎంసీఎఫ్ఏ), మీడియం చైన్ ట్రై గ్లిజరైడ్స్ (ఎంటీసీ) పుష్కలం. ఇవి జీవక్రియ రేటు మెరుగుపడటంలో సహాయపడతాయి.
గుమ్మడి గింజలు: గుమ్మడి గింజల్లో జింక్ సమృద్ధిగా ఉంటుంది. మన శరీరం విటమిన్లు, మినరల్స్‌ను గ్రహించడంలో జింక్‌ది కీలకపాత్ర. శరీరంలో థైరాయిడ్ హార్మోన్‌ను సమన్వయం చేయడంలో, సమతూకంలో ఉంచడంలో సహాయకారిగా ఉంటుంది.