Fish Alternatives | చేపలను తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. నాన్ వెజ్ ప్రియుల్లో చాలా మంది చేపలను ఇష్టంగా తింటుంటారు. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాదు. అలాగే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలోకి వస్తుంది. ఇలా చేపలతో అనేక లాభాలను పొందవచ్చు. అయితే చేపలను తినడం ఇష్టం లేని వారు అవేలాంటి లాభాలను పొందాలంటే పలు ఆహారాలను ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చేపలకు మంచి ప్రత్యామ్నాయంగా సోయా గింజలను చెప్పవచ్చు. శాకాహారులు కచ్చితంగా వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. 100 గ్రాముల సోయా గింజలను తినడం ద్వారా మనకు 36 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. అలాగే క్యాల్షియం కూడా మనకు వీటి ద్వారా సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. నాన్ వెజ్ ప్రియులు అయినప్పటికీ చేపలను తినడం ఇష్టం లేని వారు చికెన్ బ్రెస్ట్‌ను తినవచ్చు. శారీరకంగా రోజూ శ్రమ లేదా వ్యాయామం చేసేవారు, ఫిట్ నెస్ ప్రియులు చాలా మంది చికెన్ బ్రెస్ట్‌ను తింటారు. ఎందుకంటే ఇందులో 100 గ్రాములకు 31 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఫ్యాట్ కూడా తక్కువగా ఉంటుంది. కనుక ప్రోటీన్ల కోసం చూస్తున్న వారికి చికెన్ బ్రెస్ట్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
చాలా మంది పల్లీలతో చట్నీ చేసుకుంటారు. లేదా మసాలా వంటల్లో వీటిని వేస్తుంటారు. కానీ పల్లీలను రోజూ నానబెట్టి తింటే మంచిది. 100 గ్రాముల పల్లీలను తింటే సుమారుగా 25 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. పల్లీల్లో ప్రోటీన్లతోపాటు అధిక మొత్తంలో క్యాల్షియం, మాంగనీస్, మెగ్నిషియం వంటి మినరల్స్ కూడా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. నాన్ వెజ్ తినే వారు చేపలను తినలేకపోతే కోడిగుడ్లను తినవచ్చు. చేపలకు కోడిగుడ్లను మంచి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. 100 గ్రాముల కోడిగుడ్లతో 13 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. కోడిగుడ్లలో అనేక ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఇవి మనకు పోషణను అందిస్తాయి.
చేపలను తినలేని వారు బాదంపప్పును కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. బాదంపప్పులలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. 100 గ్రాముల బాదంపప్పును తింటే 21 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. బాదంపప్పును నేరుగా స్నాక్స్ రూపంలో తినవచ్చు. వీటిని నానబెట్టి తింటారు. లేదా పెనంపై కాస్త వేయించి తినవచ్చు. సలాడ్స్‌లోనూ కలిపి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా బాదం పప్పు ద్వారా లాభాలే కలుగుతాయి. శనగల్లోనూ పోషకాలు అనేకం ఉంటాయి. చేపలను తినలేని వారికి మంచి ప్రత్యామ్నాయంగా శనగలను చెప్పవచ్చు. 100 గ్రాముల శనగలను తింటే 19 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. శనగల్లో క్యాల్షియం కూడా అధికంగానే ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఇలా పలు రకాల ఆహారాలను చేపలకు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. దీంతో చేపల ద్వారా లభించే పోషకాలన్నింటినీ ఈ ఆహారాల ద్వారా కూడా పొందవచ్చు.