మన శరీరం పోషకాలను సరిగ్గా విలీనం చేసుకోకుంటే ఏం జరుగుతుందనేది మనకు అంతగా తెలియని విషయం. ఆహారంలోని పోషకాలను చిన్నపేగులు శోషింపజేసుకుని, రక్త ప్రవాహానికి జతచేస్తాయి. చిన్నపేగులు కొన్ని పోషకాలను, ద్రవాలను సరిగ్గా శోషించుకోకపోతే మనల్ని మాల్అబ్జార్పన్ సిండ్రోమ్ బాధిస్తుంది. మనం తినే ఆహారంలో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, కొవ్వుల లాంటి స్థూల పోషకాలతోపాటు, విటమిన్లు, మినరల్స్ లాంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. ఇన్ఫెక్షన్ వల్ల పేగులు దెబ్బతినడం, వాపులు, సర్జరీ, యాంటిబయాటిక్స్ దీర్ఘకాలంపాటు వాడటం, ఉదర సంబంధ వ్యాధి, పిత్తాశయ వ్యాధి, పరాన్నజీవి వ్యాధులు లాంటివి ఈ మాల్అబ్జార్పన్ సిండ్రోమ్‌కు దారితీస్తాయి. ఈ వ్యాధికి సంబంధించిన కొన్ని సంకేతాలు..
ఐరన్ లోపం వల్ల గుండె దడ పెరుగుతుంది. గుండె లయలో తేడా రావడం, పరుగు పెడుతున్నట్లుగా అనిపించడం, పొడుస్తున్నట్లుగా ఉండటం లాంటివి గుండెదడ లక్షణాలు. ఐరన్ సమృద్ధిగా లేని ఆహారం తీసుకోవడం వల్ల గుండెలయ అసాధారణంగా మారుతుంది. గుండెదడకు బాటలువేస్తుంది.
జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా లేకపోయినా కూడా శరీరం పోషకాలను తగినంతగా విలీనం చేసుకోలేదు. దాంతో పోషక లేమి ఏర్పడుతుంది. మన శరీర సామర్థ్యం తగ్గిపోతుంది. సరిగ్గా పనిచేసుకోలేం. పదిమందిలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. మనం తినే ఆహారాన్ని జీర్ణవ్యవస్థ శోషింప జేసుకోవడం లేదంటే అది జీర్ణవ్యవస్థ అపరిశుభ్రతకు సంకేతం.
పోషక లేమికి పెళుసుబారిన గోళ్లు కూడా ఒక సంకేతమే. ప్రొటీన్లు తగినంతగా లభించనప్పుడు శరీరం గోళ్ల పోషణకు అవసరమైనంత ప్రొటీన్లను పంపించడం మానేస్తుంది. తేలికపాటి మాంసాహారం, చిక్కుళ్లు, కినోవా, చేపల లాంటి ప్రొటీన్లు సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చును.
వెంట్రుకలు పెళుసుబారడం, రాలిపోవడానికీ పోషకాహార లేమి కారణమవుతుంది. శరీరం పోషకాలను సరిగ్గా తీసుకోలేదనడానికి ఇదీ ఓ సంకేతమే. వెంట్రుకలు రాలిపోవడం ఒక సమస్యగా మారిందంటే పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారానికి మారిపోవాలని అర్థం.
తిమ్మిర్లు పట్టడం, ఒళ్లు జలదరింపు లాంటివి పోషకలోపం వల్లే తలెత్తుతాయి. ముఖ్యంగా విటమిన్ బి12 లోపం వల్ల ఇలా జరుగుతుంటుంది. కాలేయం లాంటి ప్రొటీన్లు సమృద్ధిగా ఉన్న ఆహారం, విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.