వయసు పెరిగే కొద్దీ జీవితంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. జీవక్రియలు మందగిస్తాయి. హార్మోన్ల స్థాయులు మారుతాయి. గుండె జబ్బులు, మధుమేహం, ఎముకల నష్టం లాంటి దీర్ఘకాలిక సమస్యలు వెంటాడుతాయి. 40 ఏండ్లు వచ్చాయంటే మీ కండరాలను రక్షించుకోవడం, నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు మిమ్మల్ని వృద్ధాప్యానికి గురిచేసే అలవాట్లను కచ్చితంగా మానేయాల్సిందే! ఇప్పుడు తీసుకునే జాగ్రత్తలే మీ ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి.
నిద్రపోండి: 40 ఏండ్లు దాటాక నిద్ర అనేది జీవసంబంధమైన ప్రాధాన్యంగా మారుతుంది. 40- 60 మధ్య వయసున్నవారు కణజాలాలను మరమ్మతుకు, హార్మోన్లను నియంత్రించడానికి, జీవక్రియ సమతుల్యతను కాపాడుకోవడానికి రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవడం తప్పనిసరి. తకువ గంటలు నిద్రపోయే వారికి టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. నిద్రలేమి వల్ల రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది.
సరైన తిండి: నిల్వచేసిన స్నాక్స్, చకెర పానీయాలు, అల్ట్రా-ప్రాసెస్ చేసిన భోజనం తీసుకోవడం మూలంగా జీవితంలో గణనీయమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. వీటి కారణంగా ఊబకాయం పలకరిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు సైతం వెంటాడుతాయి. వాటికి బదులుగా గింజలు, పండ్లు, పెరుగు వంటివి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మద్దతు లభించి డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది.
సకాలంలో పరీక్షలు: సకాలంలో థైరాయిడ్, షుగర్ టెస్టులతో పాటు లిపిడ్ ప్రొఫైల్ లాంటి పరీక్షలు చేయించుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులను నివారించినట్టు అవుతుంది. పరీక్షలు దాటవేయడం వలన కాలేయ వ్యాధి, రక్తహీనత వంటి సమస్యలు ఆకస్మికంగా దాడి చేయొచ్చు. ఒత్తిడి సైతం వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. మానసికంగా దృఢంగా ఉండే ప్రయత్నం చేయాలి. సంతోషానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. నిత్యం వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు గట్టిపడి శక్తినిస్తాయి. అలా వృద్ధాప్యాన్ని పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు.