హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఒకనాడు ప్రభుత్వ వైద్యం అంటే.. పాడుబడిన భవనాలు, చెదలు పట్టిన కుర్చీలు, ఖాళీగా పోస్టులు, అందుబాటులో లేని మందులు, ఆమడదూరంలో అత్యాధునిక సదుపాయాలు, అనేకచోట్ల నర్సులు, కాంపౌండర్లే వైద్యం అందించిన దుస్థితి. కానీ.. తొమ్మిదేండ్లలో ప్రభుత్వ దవాఖానల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. భవనాలు బాగయ్యాయి. పోస్టులన్నీ దాదాపు నిండిపోయాయి. సరిపడా మందులు, అన్ని స్థాయిల్లోనూ అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. దీంతో ఒకప్పుడు ‘నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు’ అని పాడుకున్న రోజులనుంచి ‘చలో పోదాం.. సర్కారు దవాఖానకు’ అనే రోజులు వచ్చిన పరిస్థితి.
ఉమ్మడి రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం కునారిల్లగా.. స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే ఆరోగ్య తెలంగాణగా మారింది.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మార్గనిర్దేశనంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, వినూత్న కార్యక్రమాలు, మానవీయ పథకాలు ప్రజావైద్యంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి. క్షేత్రస్థాయిలో బస్తీ దవాఖానలు, సబ్‌సెంటర్లు, పీహెచ్‌సీలు ఉత్తమ సేవలు అందించి రోగాలు ముదరకముందే చికిత్స అందిస్తుండగా.. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రజలకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అనేక రికార్డులను నెలకొల్పింది. కేంద్రప్రభుత్వం నుంచి పదుల సంఖ్యలో అవార్డులను, ప్రశంసలను దక్కించుకున్నది. వైద్యారోగ్యశాఖ మంత్రిగా తన్నీరు హరీశ్‌రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో వైద్యరంగ సంస్కరణలు మరింత ఊపందుకున్నాయి. రాకెట్ వేగంతో నిర్ణయాలు తీసుకుంటుండగా.. అదే స్థాయిలో పనులు పరుగులు పెడుతున్నాయి. రికార్డు సమయంలో నిర్మాణాలు, వసతులు సమకూరుతున్నాయి. సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో మెరుగైన సేవలు
వ్యాధి ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడే గుర్తించి, మెరుగైన చికిత్స అందించగలిగితే అనేక ప్రయోజనాలు ఉంటాయి. రోగికి అవస్థ తప్పడంతోపాటు ఆర్థికంగా భారం తప్పుతుంది. ప్రభుత్వంపై, వైద్యరంగంపై ఒత్తిడి తగ్గుతుంది. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ప్రాథమికంగా వైద్యం అందించే పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లను ప్రభుత్వం బలోపేతం చేసింది. ఇందులో భాగంగా 43 కొత్త పీహెచ్సీ భవనాలను నిర్మిస్తున్నది. ఇందుకు రూ.67 కోట్లు ఖర్చు చేస్తున్నది. నూతనంగా ఏర్పడిన 40 మండల కేంద్రాల్లో పీహెచ్‌సీలు మంజూరు చేస్తూ ఇటీవలే క్యాబినెట్ తీర్మానించింది. దీంతోపాటు రూ.43 కోట్లతో 372 పీహెచ్‌సీల మరమ్మతులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 1,239 సబ్ సెంటర్లకు భవనాలు నిర్మిస్తున్నది. ఒక్కోదానికి రూ.20 లక్షల చొప్పున ఏకంగా రూ.247 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నది. అదనంగా 1,497 సబ్ సెంటర్ల భవనాలను రూ.60 కోట్లతో మరమ్మతులు చేయిస్తున్నది. పీహెచ్‌సీల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు రికార్డు సమయంలో ఏకంగా 950 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను నియమించింది. వీరంతా గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారు. బస్తీ దవాఖానల స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో 3,200 సబ్ సెంటర్లను ‘పల్లె దవాఖాన’లుగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. ఇవి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
జిల్లాకో మెడికల్ కాలేజీ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఇందులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య కేవలం 700. ఉస్మానియా, గాంధీ, వరంగల్ (కాకతీయ), ఆదిలాబాద్ (రిమ్స్) కాలేజీలు ఉండేవి. పేదలకు స్పెషాలిటీ సేవలు అందించడంతోపాటు, డాక్టర్ కావాలనుకునే విద్యార్థుల కలను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా 2016లో సిద్దిపేట, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేటలో 4 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. దీంతో ఎంబిబియస్ సీట్లు 1640 కి పెరిగాయి. 2021లో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, రామగుండంలలో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభం అయ్యాయి. సీఎం కేసీఆర్ వీటిని స్వయంగా ప్రారంభించి, ఒకేరోజు తరగతులు ప్రారంభించి దేశ చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించారు. దీంతో రాష్ట్రంలో మరో 1200 ఎంబీబీఎస్ సీట్లు పెరితగాయి. గత సంవత్సరం నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్‌ల్లో మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించగా.. అన్ని రకాల అనుమతులు వచ్చాయి. వీటి ద్వారా అదనంగా మరో 900 సీట్లు జతకాబోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 26 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 4440 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
నీతిఆయోగ్ హెల్త్ ఇండెక్స్‌లో అగ్రస్థానం
దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్యారోగ్య రంగం పనితీరును విశ్లేషిస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ 2021లో ‘హెల్త్ ఇండెక్స్’ను విడుదల చేసింది. ఇందులో ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. పురోగతిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పిల్లలకు వ్యాక్సినేషన్, ఆసుపత్రి ప్రసవాల పురోగతిలో తెలంగాణ దేశంలోనే టాప్‌లో నిలువడం విశేషం. నివేదిక రూపకల్పనలో భాగంగా నీతి ఆయోగ్ 24 అంశాలను పరిగణలోకి తీసుకున్నది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్), సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్), హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (హెచ్ఎంఐఎస్) వంటి పోర్టళ్లు, ఇతర మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించింది. 2019-20లో వైద్యారోగ్య రగంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ర్టాల జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఓవరాల్ పర్ఫార్మెన్స్లో 100 పాయింట్లకుగానూ.. కేరళ 82.20 స్కోర్‌తో అగ్రస్థానంలో, తమిళనాడు 72.42 స్కోర్‌తో రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ 69.95 పాయింట్లు సాధించింది. బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కేవలం 30.57 స్కోర్ సాధించి అట్టడుగున నిలిచింది. 2018-19లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉండేది. ఏడాదిలోనే తన స్థానాన్ని మెరుగుపరుచుకన్నది.
90 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ
ఆరోగ్య శ్రీ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం మరింత బలోపేతం చేసింది. రాష్ట్రంలోని 90 లక్షలకుపైగా కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ‘ఆయుష్మాన్ భారత్- ఆరోగ్యశ్రీ’ 2021 మే నెలలో విలీనం చేశారు. ప్రస్తుతం ఒకో కుటుంబానికి సంవత్సరానికి గరిష్ట కవరేజీ పరిమితి రూ.2 లక్షల నుండి రూ.5 లక్షలకు పెరిగింది. మే 2023 వరకు 15,39,994 మంది ఆరోగ్యశ్రీ సేవలను నియోగించుకున్నారు. ఇందుకోసం రూ. 6,823,59 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ నగదు రహిత చికిత్స అందించడం ఈ పథకం ఉద్దేశం. ట్-పేషెంట్ చికిత్సలు వెల్ నెస్ సెంటర్ల ద్వారా, ఇన్-పేషెంట్ చికిత్స ఎంపానెల్డ్ హాస్పిటల్స్ ద్వారా అందిస్తారు. ఈ పథకం కింద 344 ఎంప్యానెల్డ్ ఆసుపత్రులు ఉన్నాయి, వీటిలో 12,04,654 మంది లబ్ధిదారులు నమోదు చేసుకున్నారు.మే 2023 వరకు 3,65,200 మంది చికిత్సకోసం రూ.1475.19 ఖర్చు చేసింది.
అత్యవసర ఆరోగ్య రవాణా సేవలు: 108 అంబులెన్స్‌లు అత్యవసర పరిస్థితులలో రోజూ ప్రమాదాలబారిన పడిన అనేక మందిని దవాఖానలకు చేరవేస్తూ, ప్రాణాలను కాపాడుతున్నాయి. 2023 మే నాటికి 43,94,413 మందికి సేవలు అందించగా.. ప్రభుత్వం రూ.632.17 కోట్లు ఖర్చు చేసింది.
డైట్, శానిటేషన్ చార్జీల పెంపు
రోగులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం డైట్ చార్జీలను రెట్టింపు చేసింది. గతంలో రూ.40 ఉండగా రూ.80కి పెంచింది. దీనికోసం ప్రభుత్వం ఏటా రూ.43.5 కోట్లు ఖర్చు చేస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన కార్యక్రమాలు