‘జంక్ ఫుడ్’కు మనిషి మెదడు జంకిపోతున్నది. అధిక కొవ్వు, చక్కెరలతో నిండిన అనారోగ్యకరమైన ఆహారం.. మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఐర్లాండ్‌కు చెందిన యూనివర్సిటీ కాలేజ్ కార్క్ శాస్త్రవేత్తలు తాజాగా చేపట్టిన పరిశోధన.. ఈ విషయాలను తేల్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రఖ్యాత సైన్స్ జర్నల్ ‘నేచర్ కమ్యూనికేషన్స్’ ప్రచురించింది. ఈ సర్వే వివరాల ప్రకారం.. చిన్నతనంలో అధికంగా జంక్‌ఫుడ్ తినేవారిలో మెదడు ఆరోగ్యం దెబ్బతింటున్నది. వారు భవిష్యత్తులో ఆరోగ్యకరమైన ఆహారానికి మారినప్పటికీ.. అప్పటికే మెదడుకు జరిగిన నష్టం పూడ్చలేమని పరిశోధకుల మాట. బాల్యంలో అధిక కేలరీలతో నిండిన, పోషకాలు లేని జంక్‌ఫుడ్ తీసుకోవడం వల్ల.. ఆకలిని, తినే అలవాట్లను నియంత్రించే మెదడులోని ‘హైపోథాలమస్’ భాగం దెబ్బతింటుంది.
ఈ మార్పుల వల్ల భవిష్యత్తులోనూ మరింత కొవ్వు, చక్కెరలు ఉన్న ఆహారాన్నే కోరుకునేలా మెదడు రూపాంతరం చెందుతుంది. ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు మరో ఆందోళనకర విషయాన్ని గుర్తించారు. పెద్దయ్యాక పౌష్టికాహారానికి మారినప్పుడు శరీర బరువు సాధారణ స్థితికి వచ్చినప్పటికీ.. మెదడులోని ఆకలి నియంత్రణ వ్యవస్థ మాత్రం పాత అలవాట్ల ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోకపోవడం కనుగొన్నారు. అంటే, మెదడుపై జంక్‌ఫుడ్ ప్రభావం ‘నిగూఢంగా’ కొనసాగుతూనే ఉంటుందని వారు చెబుతున్నారు. అందుకే, చిన్న వయసులో ఏం తింటున్నారనేది చాలా ముఖ్యమనీ, బాల్యంలో తప్పుడు ఆహారపు అలవాట్లు భవిష్యత్తులో దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నారు.
ఈ నష్టాన్ని కొంతవరకు అధిగమించడానికి శాస్త్రవేత్తలు ఒక మార్గాన్ని కూడా సూచించారు. జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా.. మెదడు ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. కొన్ని ప్రోబయోటిక్స్ మెదడుపై జంక్‌ఫుడ్ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, అరటిపండ్లు, ఆస్పరాగస్ వంటి సహజ ఆహారాల్లో ఉండే ప్రీబయోటిక్ ఫైబర్ ఈ విషయంలో ముందుంటుంది. ఇది పొట్టలోని మంచి బ్యాక్టీరియాను పెంచి, మెదడు పనితీరును, ఆహారపు అలవాట్లను మళ్లీ ఆరోగ్యకరమైన మార్గంలోకి తెచ్చేందుకు దోహదపడుతుంది. కాబట్టి, పిల్లలకు చిన్నవయసు నుంచే సహజమైన పౌష్టికాహారాన్ని అలవాటు చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు.