ఐరోపా, ఆఫ్రికా ఖండాల మధ్య ఉన్న సముద్రమే మధ్యధరా సముద్రం. దీనికి చుట్టుపక్కల దేశాల్లో ఉండే ప్రజలు ప్రధానంగా తీసుకునే ఆహారాన్ని మధ్యధరా ఆహార విధానం (మెడిటరేనియన్ డైట్) అని పిలుస్తారు. ఈ ఆహార విధానాన్ని అనుసరించే వాళ్లు మిగిలిన వాళ్లతో పోలిస్తే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువ కాలం జీవిస్తారు. కాబట్టి, మెడిటరేనియన్ డైట్‌ను ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తుంటారు. అంతేకాదు బరువు తగ్గడంలోనూ ఇది ముఖ్యపాత్ర పోషిస్తుందని ‘ఫిజీషియన్స్ కమిటీ ఫర్ రెస్పాండిబుల్ మెడిసిన్’ నేతృత్వంలో జరిగిన అధ్యయనం తెలిపింది. దీనికోసం కొంతమందిని పరిశీలనకు ఎంచుకున్నారు. వారిని రెండు వర్గాలుగా విభజించారు.
పదహారు వారాలపాటు మెడిటరేనియన్ ఆహారం, ఆ తర్వాత మరో పదహారు వారాలపాటు ఇతర ఆహారాన్ని తీసుకోవాల్సిందిగా వారికి సూచించారు. ఆ తర్వాత వారిని పరిశీలిస్తే మెడిటరేనియన్ ఆహారం తిన్న తర్వాత బరువు తగ్గినట్టు గుర్తించారు. అంతేకాదు గుండెపోటు, పక్షవాతం, మధుమేహం, ఫ్యాటీ లివర్ డిసీజ్ లాంటి వ్యాధుల నుంచి రక్షణ కూడా లభిస్తుందని తెలిపారు.
తాజా పండ్లు, కూరగాయలు, క్వినోవా, దంపుడు బియ్యం (బ్రౌన్ రైస్), ఆలివ్ ఆయిల్, చేపలు, లెగ్యూమ్స్, పౌల్ట్రీ ఆహారం, గింజలు వంటివి మధ్యధరా ఆహారంలో ప్రధానంగా ఉంటాయి.