Weight Loss | నేటితరం మహిళల్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్య.. అధిక బరువు. దీనివెంటే.. కీళ్లనొప్పులు, గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలూ పలకరిస్తాయి. కాబట్టి, ఎలాగైనా బరువు తగ్గాల్సిందేనని కంకణం కట్టుకుంటారు. ఇక యువతులైతే నాజూగ్గా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారు. అలా.. ‘బరువు’ను కంట్రోల్ చేసేందుకు ‘స్ట్రిక్ట్ డైట్’ పాటిస్తుంటారు. ప్రతిరోజూ రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. అయినా.. కొందరుమాత్రం బొద్దుగానే కనిపిస్తుంటారు. ఒళ్లు హూనమయ్యేలా వర్కవుట్స్ చేస్తున్నా.. నోరు కట్టేసుకుని హెల్తీ డైట్ పాటిస్తున్నా.. బరువెందుకు తగ్గడం లేదని బాధ పడుతుంటారు. అయితే, వారికి తెలియకుండానే చేసే కొన్ని తప్పులు.. బరువు తగ్గకుండా చేస్తాయని వ్యాయామ నిపుణులు చెబుతున్నారు. వాటిని గుర్తించి, పునరావృతం కాకుండా చూసుకుంటే.. ‘బరువు’ను నియంత్రణలో ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు.
బరువు తగ్గేందుకు భారీ వ్యాయామాలు చేయవద్దనీ, అలా చేయడం వల్ల కండరాలు మరింత బలాన్ని పొందుతాయని చెబుతున్నారు. ఎక్కువ ఒత్తిడికి గురైనా బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇక రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం, అందులోనూ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం కూడా బరువు పెరగడానికి కారణం అవుతాయి.
ఇక మహిళల్లో అంతర్లీనంగా ఉండే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వారి బరువును ప్రభావితం చేస్తాయని నిపుణుల మాట. ముఖ్యంగా.. ఆడవాళ్లలో హార్మోన్ల అసమతుల్యత వల్ల జీవక్రియలు నెమ్మదించి, బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక పీసీఓడీ, పీసీఓఎస్ సమస్యలు కూడా బరువును పెంచేవే! మెనోపాజ్ సమయంలోనూ కొందరు బరువు పెరుగుతుంటారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు.. బరువును నియంత్రణలో ఉంచుకోవడం కొంచెం కష్టమే!
నిద్రలేమి కూడా బరువు పెరగడానికి ఓ కారణం! రాత్రిపూట ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోయే వారి శరీరంలో.. కొవ్వు ఎక్కువగా పెరిగిపోతుందట. నిద్రలేమి వల్ల శరీరంలో కార్టిసోల్, ఇన్సులిన్ హర్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయనీ, ఇవి శరీర బరువు పెరిగేలా చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్యలను గుర్తించి, పరిష్కార మార్గాలను ఫాలో అయితే.. బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.