సోమవారం 25 జనవరి 2021
Health - Jan 09, 2021 , 15:15:58

పెండ్లిలో చిన్న గొడ‌వ‌.. 16 ఏండ్ల బాలుడి దారుణ హ‌త్య‌

పెండ్లిలో చిన్న గొడ‌వ‌.. 16 ఏండ్ల బాలుడి దారుణ హ‌త్య‌

నాగ్‌పూర్: చిన్న వ‌య‌సులోనే  పెద్ద‌పెద్ద గొడ‌వ‌లు. నూనూగు మీసాలు కూడా రాక‌ముందే ప‌గ‌లు, ప్ర‌తీకారాలు. గ్రూపులు క‌ట్టి ఒక‌రిపై ఒక‌రు భౌతిక దాడులు. అది కాస్తా శృతి మించితే హ‌త్య‌లు. ఇదీ నేటి యువ‌తో నానాటికి పెరిగిపోతున్న‌ పెడ‌ధోర‌ణి. తాజాగా మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్ సిటీలో చోటుచేసుకున్న ఘ‌ట‌నే ఇందుకు నిద‌ర్శ‌నం. నాగ్‌పూర్‌లో ఓ 16 ఏండ్ల బాలుడిని మ‌రో ఇద్ద‌రు మైన‌ర్లు, ఓ యువ‌కుడు క‌లిసి దారుణంగా హ‌త్యచేశారు. పెండ్లిలో జ‌రిగిన చిన్న గొడ‌వే ఈ హ‌త్య‌కు దారితీసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. నాగ్‌పూర్‌లోని దీప్తి సింఘాల్ ఏరియాకు చెందిన విన‌య్ ద‌హారే (16) గ‌త నెల స్థానికంగా జ‌రిగిన ఓ వివాహ‌ వేడుక‌కు హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్భంగా అదే ఏరియాకు చెందిన యోగేశ్ బంగారే (20) అనే యువ‌కుడికి, విన‌య్ ద‌హారేకు మ‌ధ్య చిన్న విష‌యానికే గొడ‌వ జ‌రిగింది. మాటామాటా పెరిగి పోట్లాట‌కు దిగ‌డంతో పెండ్లిలో ఉన్న బంధువులు ఇద్ద‌రినీ విడిపించి పంపించారు. 

ఈ ఘ‌ట‌న‌ను మ‌న‌సులో పెట్టుకున్న యోగేశ్ బంగారే నెల‌రోజులుగా ప‌గ‌తో ర‌గిలిపోయాడు. విన‌య్ అంతం చేయాల‌ని నిర్ణ‌యించుకుని అవ‌కాశం కోసం ఎదురుచూశాడు. శుక్ర‌వారం రాత్రి విన‌య్ ఒంట‌రిగా వ‌స్తున్నాడ‌ని తెలుసుకుని మ‌రో ఇద్ద‌రు మైన‌ర్ల‌లో క‌లిసి ప‌థ‌కం వేశాడు. విన‌య్ ఇంటికి వెళ్లే దారిలో కాపుకాసి అత‌ను అక్క‌డికి చేరుకోగానే క‌త్తుల‌తో పొడిచి దారుణంగా హ‌త్య‌చేశారు. మృతుడి కుటుంబం ఫిర్యాదు మేర‌కు ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.            

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo