Constipation | కొంతమందికి టీ తాగుతూనే సిగరెట్ ఊదడం గొప్ప రిలాక్స్‌గా ఉంటుంది. అయితే అతిగా టీ సేవించడం, ధూమపానం చేయడం మంచిది కాదంటున్నారు వైద్యులు. టీ ఎక్కువగా తాగితే ఎక్కువగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఫలితంగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. శరీరంలో తగినన్ని నీళ్లు లేకపోవడంతో మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. కాబట్టి టీ మితంగానే తీసుకోవాలి.
ఇక ధూమపానం సంగతి చెప్పనక్కర్లేదు. పొగ తాగడం ఆహార నాళం, పొట్ట వ్యవస్థ మొత్తానికి చేటు చేస్తుంది. అతి ధూమపానం పొట్టకు మంచి చేసే సూక్ష్మక్రిముల మనుగడకు ఆటంకాలు సృష్టిస్తుందట. దీంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు పొగాకులో ఉండే నికోటిన్ పేగుల్లో రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుందట. అలా వాటి పనితీరును దెబ్బతీస్తుంది. కాలక్రమంలో ఇది పేగుల్లో మంటకు దారితీసి పేగుల లైనింగ్‌ను ధ్వంసం చేస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు, మలబద్ధకం ముప్పు పొంచి ఉంటుందట.
కాబట్టి… టీ, కాఫీలు తాగడంపై పరిమితులు విధించుకోవాలి. తగినన్ని నీళ్లు తాగాలి. పొట్టకే కాదు శరీర ఆరోగ్యానికి చేటుచేసే ధూమపానాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. పండ్లు, కూరగాయలు, ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆరోగ్యకరమైన ఆహార విధానాన్ని అలవర్చుకోవాలి. దినచర్యలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి.