Weight Loss Drinks | అధికంగా బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. వేళ తప్పించి భోజనం చేయడం, అతిగా తినడం, శీతల పానీయాలను అధికంగా తాగడం, మద్యం సేవించడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి.. వంటి అనేక అంశాలు అధికంగా బరువు పెరిగేలా చేస్తాయి. థైరాయిడ్ వల్ల కూడా కొందరు బరువు పెరుగుతుంటారు. అయితే బరువు పెరిగిన వారు దాన్ని తగ్గించుకునేందుకు నానా యాతన పడుతుంటారు. ఈ క్రమంలోనే అధికంగా బరువు ఉన్నవారు రోజూ వ్యాయామం చేయడంతోపాటు సరైన డైట్‌ను పాటించాలి. ముఖ్యంగా కొన్ని రకాల డ్రింక్స్‌ను రోజూ తీసుకోవడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఇక ఆ డ్రింక్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక బరువును తగ్గించడంలో నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే నిమ్మజాతికి చెందిన నారింజ, సంత్రా వంటి పండ్లను కూడా తినవచ్చు. ఇవి కూడా అధిక బరువును తగ్గించేందుకు దోహదం చేస్తాయి. ఈ పండ్లలో పీచు అధికంగా ఉంటుంది. అలాగే అనేక పోషకాలు ఉంటాయి. కార్బొహైడ్రేట్లు స్వల్ప మోతాదులో ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండ్లు మంచి పోషకాలను అందిస్తాయి. రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగవచ్చు. లేదా ఒక నారింజ పండును తినవచ్చు. ఇలా చేస్తుంటే కచ్చితంగా బరువు తగ్గుతారు. కాఫీ కూడా అధిక బరువును తగ్గించేందుకు సహాయం చేస్తుంది. అయితే కాఫీలో పాలు కలిపి తాగకూడదు. బ్లాక్ కాఫీ తాగాలి. ఇది మెటబాలిజంను పెంచుతుంది. రోజుకు 2 కప్పుల బ్లాక్ కాఫీని సేవిస్తుంటే సులభంగా క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.
యాపిల్ సైడర్ వెనిగర్ అనేక పోషకాలను కలిగి ఉంటుంది. బరువును తగ్గించేందుకు ఇది సహాయం చేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో పావు టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, ఒక టీస్పూన్ తేనె కలిపి రాత్రి నిద్రకు ముందు సేవించాలి. అసిడిటీ ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తాగకూడదు. దీన్ని రాత్రి పూట తాగితే కొవ్వు కరుగుతుంది. బరువు సులభంగా తగ్గుతారు. గ్రీన్ టీలోనూ అనేక పోషకాలు ఉంటాయి .ఇవి శరీర మెటబాలిజంను పెంచి క్యాలరీలు కరిగేలా చేస్తాయి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి శరీరంలో అధికంగా ఉండే కొవ్వును కరిగిస్తాయి. రోజుకు 2 కప్పుల గ్రీన్ టీని సేవిస్తుంటే బరువు సులభంగా తగ్గుతారు. గ్రీన్ టీని తాగడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు.
తేనె ప్రకృతి మనకు అందించిన సహజ సిద్ధమైన పదార్థం. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనె కలిపి ఉదయం పరగడుపునే తాగాలి. రోజూ ఇలా తాగుతుంటే కొన్ని రోజుల్లోనే తప్పకుండా మార్పు కనిపిస్తుంది. బరువు తగ్గి సన్నగా నాజూగ్గా తయారవుతారు. రోజూ ఒక యాపిల్ పండును తినడం వల్ల డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదన్న సామెత అందరికీ తెలిసిందే. యాపిల్ పండులో మన శరీరానికి అవసరం అయ్యే పోషకాలు దాదాపుగా అన్నీ ఉంటాయి. అందుకనే ఆ విధంగా చెబుతుంటారు. అయితే రోజూ ఒక యాపిల్‌ను తింటే బరువు తగ్గుతారు. యాపిల్‌ను ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తినాలి. మీరు రోజూ తినే బ్రేక్ ఫాస్ట్‌ను కాస్త తగ్గించి అందుకు బదులుగా ఒక యాపిల్‌ను తినండి. బరువును తగ్గించడంలో యాపిల్ సమర్థవంతంగా పనిచేస్తుంది. దీంతో రక్త సరఫరా సైతం మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ యాపిల్ పండును తినేందుకు టైమ్ లేని వారు దాన్ని జ్యూస్ పట్టి తాగవచ్చు. ఇలా చేసినా మేలు జరుగుతుంది. ఇలా పలు డ్రింక్స్ బరువును తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తాయి.