Heart Health | ప్రస్తుతం చిన్న వయస్సులో ఉన్నవారు కూడా హార్ట్ ఎటాక్ బారిన పడి ప్రాణాలు విడుస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ మహమ్మారి వచ్చి వెళ్లిన తరువాత చాలా మంది హార్ట్ ఎటాక్ల బారిన పడుతుండడం అందరినీ కలవర పెడుతోంది. అప్పటి వరకు యాక్టివ్‌గా, చురుగ్గా, ఆరోగ్యంగా ఉన్నవారు కూడా సడెన్‌గా గుండె పోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. అయితే ఇలా సడెన్ హార్ట్ ఎటాక్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ కొన్ని రకాల ఆహారాలను తింటుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందని, హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చని వారు సూచిస్తున్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో టమాటాలు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. టమాటాల్లో అనేక పోషకాలు ఉంటాయి.
టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. ఇది గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. టమాటాలను ఏ రకంగా తరచూ తీసుకున్నా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. టమాటాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. వీటిల్లో ఉండే విటమిన్ సి, ఇ, ఫ్లేవనాయిడ్స్, పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా నివారిస్తాయి. మీకు బ్రొకలీ తెలిసే ఉంటుంది. ఇది చూసేందుకు కాలిఫ్లవర్ మాదిరిగా ఉంటుంది. కానీ ఆకుపచ్చని గుత్తుల పువ్వులు ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని గ్రీన్ కాలిఫ్లవర్ అని కూడా పిలుస్తారు. ఇందులో కెరోటినాయిడ్స్, ఇండోల్స్ తదితర సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలు ఉత్పత్తి కాకుండా చూస్తాయి.
బ్రొకలీలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, క్యాల్షియం, విటమిన్ బి2, ఐరన్ గుండెను సంరక్షిస్తాయి. రక్తసరఫరా మెరుగు పడేలా చూస్తాయి. బ్రొకలిని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే కొలస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీని వల్ల రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇక గుండె ఆరోగ్యానికి దానిమ్మ పండ్లు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లను తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వీటిల్లో ఉండే విటమిన్ బి12 ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయం చేస్తుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. తరచూ దానిమ్మ పండ్లను తింటున్నా, దాని జ్యూస్‌ను సేవిస్తున్నా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బీపీ తగ్గుతుంది.
గుమ్మడికాయల్లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కంటి చూపును మెరుగు పరచడంతోపాటు కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే చేపలను తింటున్నా కూడా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులను తొలగిస్తాయి. దీని వల్ల హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. అదేవిధంగా బెర్రీలను కూడా తినాలి. చెర్రీలు, రాస్ప్ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీ వంటి బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె పోటు రాకుండా నివారిస్తాయి. అంజీర్ పండ్లను ఆహారంలో భాగం చేసుకున్నా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ పండ్లలో ఉండే పోషకాలు గుండె పోటు రాకుండా అడ్డుకుంటాయి. ఇలా పలు రకాల ఆహారాలను తరచూ తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నిరోధించవచ్చు.