Foxtail Millets | ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతున్న చాలా మంది పోషకాలు కలిగే ఉండే ఆహారాలను తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగానే చాలా మంది మిల్లెట్లను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. వీటినే చిరు ధాన్యాలు లేదా సిరి ధాన్యాలు అని కూడా పిలుస్తారు. మిల్లెట్లను తినడం వల్ల ఎంతగానో ప్రయోజనం ఉంటుందని పోషకాహార నిపుణులు, ప్రకృతి వైద్య నిపుణులు చెబుతుండడంతో మిల్లెట్లకు డిమాండ్ బాగానే పెరిగింది. మిల్లెట్లతో చేసిన అనేక ఆహారాలు, తినుబండారు, బిస్కెట్లు వంటివి కూడా మనకు అందుబాటులో ఉంటున్నాయి. అయితే మిల్లెట్లలో వేటికవే అనేక ప్రత్యేకతలను కలిగి ఉన్నా చాలా మంది తింటున్న వాటిలో కొర్రలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మన పూర్వీకులు కొర్రలను అధికంగా తినేవారు. కొర్రలను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
కొర్రలలో అనేక పోషకాలు ఉంటాయి. వీటిల్లో ఉండే కార్బొహైడ్రేట్లు మన శరీరానికి శక్తిని అందిస్తాయి. కొర్రలలో ఉండే ప్రోటీన్లు కండరాలకు శక్తిని అందించి కండరాలు నిర్మాణం అయ్యేలా చూస్తాయి. కొర్రల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది. షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. కొర్రలలో నియాసిన్, థయామిన్, రైబోఫ్లేవిన్ అనే పలు రకాల బి విటమిన్లు సమృద్దిగా ఉంటాయి. ఐరన్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, పొటాషియం, క్యాల్షియం, జింక్, మాంగనీస్ వంటి మినరల్స్ కూడా కొర్రల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరంలో జీవక్రియలు సరిగ్గా నిర్వహించేందుకు దోహదం చేస్తాయి.
కొర్రల గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల కొర్రలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగవు. పైగా వీటిల్లో ఉండే ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు కొర్రలను తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. కొర్రలలో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతుంది. దీంతో బీపీ, కొలెస్ట్రాల్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తుంది. కొర్రలలో అధికంగా ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
కొర్రలలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. మలబద్దకం ఉన్నవారు రాత్రి పూట కొర్రలను తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. కొర్రలలో ఫినోలిక్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్, టానిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ఫలితంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. కొర్రలలో క్యాల్షియం కూడా అధికంగానే ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది. ఎముకలు విరిగి ఉన్నవారు కొర్రలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎముకలు త్వరగా అతుక్కునేలా చేయవచ్చు. ఇలా కొర్రలను తింటే అనేక అద్భుతమైన లాభాలను పొందవచ్చు.