Eye Health | అత్యంత ప్రధానమైనవే అయినప్పటికీ రోజువారీ పనుల్లో పడిపోయి కండ్ల ఆరోగ్యం గురించి మనం అంతగా పట్టించుకోం. అయితే, గంటల తరబడి డిజిటల్ తెరలకు అతుక్కుపోవడం, బల్బుల కాంతిలో గడపడం, ఆధునిక జీవనశైలి మన కండ్ల ఆరోగ్యానికి హాని చేస్తున్నాయి. మొదట్లో ఏమంత ఇబ్బందిగా అనిపించకపోయినా ఈ అలవాట్లు దీర్ఘకాలంలో కంటి సమస్యలకు అంటుకడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంటి సమస్యలకు కారణమయ్యే కొన్ని అలవాట్ల పట్ల శ్రద్ధ చూపాలని సలహా ఇస్తున్నారు.
స్మార్ట్ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల తెరలను గంటల తరబడి చూస్తుండటంతో కండ్లు ఒత్తిడికి గురవుతాయి. దీంతో పొడిబారడం, మంట, చూపులో సమస్యలు మొదలైనవి తలెత్తుతాయి. ఇవన్నీ అలా ఉంచితే తెరల నుంచి సోకే బ్లూ లైట్ మన నిద్రా చక్రం మీద దుష్ప్రభావం చూపుతుంది. డిజిటల్ పరికరాల వాడకం తప్పనిసరి కాబట్టి, 20 20 20 నియమాన్ని పాటించాలి. ప్రతి ఇరవై నిమిషాలకోసారి ఇరవై సెకండ్లు విరామం తీసుకోవాలి. ఓ ఇరవై అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడటమే ఈ విధానం. చిన్నపిల్లలు అదేపనిగా డిజిటల్ తెరలకు అతుక్కుపోతే హ్రస్వదృష్టి సమస్య తలెత్తుతుంది. కాబట్టి, ఆరుబయట ఆటలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
తలనొప్పి, ఎక్కువ రోజులు కండ్లు పొడిబారడం, అలసిపోయినట్టు ఉండటం మొదలైనవి తీవ్రమైన కంటి సమస్యలకు తొలి సంకేతాలు. వీటిని నిర్లక్ష్యం చేస్తే మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి కండ్లలో అసౌకర్యంగా ఉన్నా, చూపులో ఇబ్బందిగా అనిపించినా కండ్ల డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. నిర్లక్ష్యం చేయకూడదు.
ఆరోగ్యకరమైన శరీరంతోనే ఆరోగ్యకరమైన కండ్లు సాధ్యమవుతాయి. ఒకవేళ మధుమేహం, అధిక రక్తపోటు ఉంటే కండ్ల మీద దుష్ప్రభావం పడుతుంది. మధుమేహ రోగుల్లో కంటి శుక్లాలు, గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతీ, కంటి ఇన్ఫెక్షన్లు తలెత్తే ముప్పు ఎక్కువ. కాబట్టి రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయులు, కొలెస్ట్రాల్ స్థాయులను అదుపులో పెట్టుకోవడం
అత్యవసరం.
కండ్లకు ఏదైనా ఇబ్బంది వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మనకు తెలిసిన వైద్యమో, తెలిసినవాళ్లు చెప్పిందో చేసేసుకుంటూ ఉంటాం. ఇక స్థానిక మందుల దుకాణానికి వెళ్తే కంటిమంట, అసౌకర్యానికి మామూలు డ్రాప్స్ ఇస్తాడు. అయితే, వీటిలో స్టెరాయిడ్స్ ఉండే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో ఇవి కండ్లకు హానిచేస్తాయి. కాబట్టి, కంటి డాక్టర్ సూచించిన డ్రాప్స్ మాత్రమే వాడాలి.
సూర్యుడి కాంతిలో అల్ట్రావయోలెట్ (యూవీ) కిరణాలు కూడా ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఎండలో తిరిగితే కాలం గడిచేకొద్దీ కండ్లలో శుక్లాలు, మాక్యులర్ డిజనరేషన్ (వయసు పెరిగే కొద్ది తలెత్తే దృష్టిలోపం) లాంటి సమస్యలు తలెత్తుతాయి. సన్ గ్లాసెస్ వాడటం వల్ల అల్ట్రావయోలెట్ కిరణాల నుంచి కండ్లను రక్షించుకోవచ్చు. మనం వాడే సన్‌గ్లాసెస్ కూడా యూవీ ఏ, యూవీ బీ రేడియేషన్ నుంచి కూడా రక్షణను ఇచ్చేవై ఉండాలి.
కంటి చూపు బాగుండాలన్నా, కంటి సమస్యల తొలి సంకేతాలను గుర్తించాలన్నా క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. అయితే, చాలామంది వీటి గురించి అంతగా పట్టించుకోరు. తమ చూపు బాగానే ఉందనుకుని కంటి అనారోగ్య లక్షణాలను నిర్లక్ష్యం చేస్తారు. మరో విషయం డాక్టర్లు సూచించిన కళ్లద్దాలు వాడకపోతే సమస్య ముదిరిపోతుంది. కాబట్టి, కంటి ఆరోగ్యం కాపాడుకోవడానికి నలభై లోపువాళ్లయితే రెండేండ్లకోసారి, నలభై దాటితే ఏడాదికోసారి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.