Black Gram | ఆహారంలో భాగంగా మనం అనేక రకాల పప్పుదినుసులను తీసుకుంటూ ఉంటాం. వాటిలో మినుములు కూడా ఒకటి. ఇవి మనకు పొట్టు తీసిన పప్పు, పొట్టు తీయని పప్పు రూపంలో లభిస్తూ ఉంటాయి. మినుములతో మనం దోశ, ఇడ్లీ, వడ, కిచిడీ, గారెలు అనేక రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. మినుములతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. దాదాపు ఈ పప్పు ప్రతి ఒక్కరి వంటగదిలో ఉంటుందని చెప్పవచ్చు. మినుముల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ పప్పును ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇవి మనకు అనేక పోషకాలను అందించి మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
మినుముల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ పప్పును తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధి అదుపులోకి రాక ఇబ్బందిపడే వారు మినప పప్పును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మినప పప్పులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఫినోలిక్ ఆమ్లాలు, ప్లేవనాయిడ్స్, కండెన్డ్స్ టానిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కనుక వీటిని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. మినుముల్లో ప్రోటీన్ల తో పాటు మిథైల్ ఈస్టర్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్ ల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో శరీరం ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటుంది.
మినుముల్లో ప్రోటీన్ల తో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇవి శరీరంలో లిపిడ్ కొవ్వు స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. మినప పప్పులో క్యాల్షియం, భాస్వరం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను ధృడంగా మార్చడంలో సహాయపడతాయి. మినప పప్పును తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మినుముల్లో ఫైటిక్ ఆమ్లాలు, ప్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అంతేకాకుండా కాలేయంలో ఉండే హెపాటిక్ మైక్రోసోమల్ ఎంజైమ్ ను నిరోధించడంలో కూడా సహాయపడతాయి. ఈవిధంగా మినుములు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ మినుములను పొట్టుతో కలిపి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వారు తెలియజేస్తున్నారు.