నిత్య జీవితంలో అనేక పదార్థాలకు ఆహారంలో చోటిస్తాం. కొన్నింటిని అంత పెద్దగా ఆలోచించకుండానే తీసుకుంటూ ఉంటాం. కనీసం అవి మన ఆరోగ్యానికి అంత హాని చేస్తాయన్న విషయమూ తెలీదు! అలాంటి ఓ పదార్థం రోజులో ఒక్క స్పూను తీసుకున్నా గుండెకు 18 శాతం ఎక్కువ ముప్పు అని చెబుతున్నారు వైద్యులు. అదే దానికి రెండింతలు తీసుకుంటే 21 శాతం ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు. కొలెస్ట్రాల్ కన్నా ప్రమాదకరమంటున్న ఆ పదార్థమే చక్కెర. ఇటీవల జామా ఇంటర్నేషనల్ మెడికల్ జర్నల్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం రోజువారీ ఆహారంలో 10 శాతం లేదా అంత కన్నా తక్కువ చక్కెరలు తీసుకునే వాళ్లతో పోలిస్తే పాతిక శాతం, అంతకన్నా ఎక్కువ శాతం చక్కెరలు తీసుకునే వాళ్లు హృదయ నాళాలకు సంబంధించిన వ్యాధులతో చనిపోయే అవకాశం రెండింతలు అధికంగా ఉంటుందట.
అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాల ద్వారా చక్కెరలు అధికంగా తీసుకునే వాళ్లలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 17 శాతం ఎక్కువగా, కరోనరీ ఆర్టెరీ డిసీజ్ బారిన పడే అవకాశం 23 శాతం ఎక్కువగా, స్ట్రోక్‌కి గురయ్యే రిస్క్ 9 శాతం ఎక్కువగా ఉంటుందట. రోజువారీ వ్యాయామాలు చేసే వారిలో కూడా ఈ ప్రమాదం పొంచి ఉంటుందని ఈ నివేదిక చెబుతున్నది.
ఏడాదిలో కనీసం పది లక్షల మంది గుండె జబ్బులకు, ఇరవై రెండు లక్షల మందిలో టైప్ 2 డయాబెటిస్‌కు రోజు వారీ ఆహారంలో తీసుకునే చక్కెరలే కారణం అవుతున్నాయట. ఇలా ఆహారంలో అధిక చక్కెరలు తీసుకోవడం అన్నది రక్తపోటు, ఇన్ఫ్లమేషన్, కొలెస్ట్రాల్ స్థాయుల పెరుగుదలకు కారణం అవుతున్నది. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే తమ ఆహారంలో చక్కెర శాతం ఎంత ఉంటున్నది చూసుకొని దాని ప్రకారం మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.