న్యూయార్క్ : నిద్రలేమి శారీరక, మానసిక రుగ్మతలకు దారితీస్తుందని కంటినిండా కునుకు తీస్తే ఏ అనారోగ్యాలూ దరిచేరని వైద్య నిపుణులు చెబుతుంటారు. రోజుకు కనీసం ఎనిమిది గంటల పాటు నిద్రించాలని సూచిస్తుంటారు. అయితే రోజుకు విధిగా ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలనే నిబంధన అవసరం లేదని తాజా అధ్యయనం వెల్లడించింది.
మరీ అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రకు ఉపక్రమించకుండా ముందుగానే కునుకు తీయాలని ఉదయాన్నే త్వరగా మేలుకోవాలని ఈ అధ్యయనం పేర్కొంది. రోజుకు ఏడు గంటల పాటు గాఢనిద్ర సరిపోతుందని నిపుణులు తేల్చిచెప్పారు. ఇలా చేస్తే మెదడు చురుకుగా పనిచేస్తుందని అన్ని రకాల వయసుల వారికీ ఏడు గంటల నిద్ర చాలని పేర్కొన్నారు. గాఢ నిద్రతో మెదడు చైతన్యవంతమవుతుందని నేచర్ ఏజింగ్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం స్పష్టం చేసింది.
మెదడును శుభ్రపరిచేందుకు మరమ్మత్తులు, రీకనెక్టింగ్, మెమరీస్ను నిక్షిప్తం చేయడం వంటి ప్రక్రియకు సమయం అవసరమని ఏడు గంటల నిద్రతో ఈ ప్రక్రియ సాఫీగా సాగుతుందని పేర్కొంది. తగినంత నిద్ర కరవైన వారికి ఈ ఆరోగ్య ప్రయోజనాలు అందవని, క్రమంగా బ్రెయిన్ రిపేర్ ప్రక్రియ జాప్యం జరగడంతో హార్మోన్లలో మార్పులు జరిగి వయసు పెరిగేకొద్దీ నిద్ర పట్టదని తెలిపింది. రాత్రిళ్లలో ఏడు గంటల నిద్రతో రుగ్మతలు దరిచేరకుండా చూసుకోవచ్చని ఈ అధ్యయనం వెల్లడించింది.