న్యూయార్క్ : కాఫీతోనే మనలో చాలా మంది రోజు ప్రారంభమవుతుంది. కప్పు కాఫీ ఆస్వాదించగానే రోజంతా ఉత్తేజంగా పనిచేసే ఎనర్జీ వచ్చిన భావన కలుగుతుంది. కాఫీలో ఉండే కెఫీన్ వల్లే ఇది సాధ్యం కాదని, అంతకుమించి కాఫీ మెదడుకు ఉత్తేజం కల్పిస్తుందని నూతన అధ్యయనం (Study On Coffee) వెల్లడించింది. బిహేవియరల్ న్యూరోసైన్స్ జర్నల్ ఫ్రంటియర్స్లో ప్రచురితమైన అధ్యయనం ఈ వివరాలు తెలిపింది. ఒక కప్పు కాఫీ తాగడం వల్ల కలిగే ఎఫెక్ట్స్‌ను కెఫిన్ కేవలం పాక్షికంగా మాత్రమే అందచేయగలుగుతుందని పరిశోధకులు గుర్తించారు.
కాఫీ మెదడును అప్రమత్తం చేయడంతో పాటు జ్ఞాపక శక్తిని ఉత్తేజపరిచి మెదడును లక్ష్యం దిశగా పనిచేసేలా చేస్తుందని అధ్యయనం స్పష్టం చేసింది. కాఫీ మెదడును అలర్ట్ చేయడంతో పాటు సైకోమోటార్ పనితీరును మెరుగుపరుస్తుందనే అంచనాలు ఉన్నాయని, దీనిపై లోతైన పరిశీలిన చేపడితే దీని ప్రయోజనాలు బహుముఖంగా కనిపిస్తాయని అధ్యయన సహ రచయిత నునో సౌస వివరించారు.
అధ్యయనంలో భాగంగా కాఫీ, కెఫీన్‌ను విడివిడిగా తీసుకున్న వారి బ్రైన్ ఎంఆర్ఐ స్కాన్ల ఆధారంగా పలు విషయాలను పసిగట్టారు. కాఫీ, కెఫిన్ రెండింటినీ తాగడం వల్ల మెదడు యొక్క డిఫాల్ట్ మోడ్ నెట్‌వర్క్‌లో న్యూరానల్ కనెక్షన్ తగ్గుతుందని గమనించారు. ఈ మార్పు ప్రజలు విశ్రాంతి నుంచి పనిచేసేందుకు సంసిద్ధంగా ఉండేందుకు సంకేతమని పరిశోధకులు పేర్కొన్నారు. కాఫీ తాగడంతో మెదడును లక్ష్యం దిశగా నడిపించడం, మెరుగైన విజన్, జ్ఞాపకశక్తి మెరుగుదల వంటి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని గుర్తించారు. అయితే కేవలం కెఫీన్‌ను తీసుకునే వారిలో ఇలాంటి సానుకూల ప్రభావాలను పరిశోధకులు గుర్తించకపోవడం గమనార్హం.
Read More :
Mehndi | మెహిందీ కోన్ పట్టుకోవడం రాకపోయినా అరచేతిపై అద్భుతమైన డిజైన్లు వేసుకోవచ్చు!