న్యూయార్క్ : వాయు కాలుష్యంతో పలు అనారోగ్యాలు వెంటాడుతతాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించగా కాలుష్యానికి ఎక్కువ కాలం గురైన మహిళలు బరువు పెరగడం, బాడీ మాస్ ఇండెక్స్‌లో వ్యత్యాసాలు, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వంటి ముప్పు ఎదుర్కొంటారని తాజా పరిశోధనలో వెల్లడైంది. మధ్యవయసు మహిళల్లో అధిక బరువు, కొవ్వు సమస్యలకు వాయు కాలుష్యానికి సంబంధం ఉందని అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
దీర్ఘకాలం వాయు కాలుష్యానికి లోనైన 40, 50 ఏండ్ల వయసు మహిళల్లో వారి శరీర పరిమాణం, బరువు పెరిగినట్టు వెల్లడైందని జర్నల్ డయాబెటిస్ కేర్‌లో ప్రచురితమైన అధ్యయయనం వెల్లడించింది. 50 ఏండ్ల సగటు వయసున్న పలు దేశాల మహిళలపై ఈ అధ్యయనం చేపట్టారు.
వాయు కాలుష్యం వల్ల ఎదురయ్యే సమస్యలను అధిగమించడంలో శారీరక వ్యాయామం దీటుగా పనిచేస్తుందని కూడా పరిశోధన తెలిపింది. అయితే మధ్యవయసు మహిళలపై ఈ పరిశోధన దృష్టి సారించినందున అధ్యయన వివరాలను ఇతర వయసుల మహిళలు, పురుషులకు వర్తింపచేయలేమని యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎపిడెమాలజీ రీసెర్చి ఇన్వెస్టిగేటర్ జిన్ వాంగ్ పేర్కొన్నారు.