Intermittent Fasting | మన వాళ్లలో ముఖ్యంగా ఆడవాళ్లు ఉపవాసాలు చేస్తుండటం చూస్తుంటాం. కొందరు ప్రత్యేక రోజుల్లో ఉపవాసాలు ఉంటే.. మరికొందరు అడపాదడపా ఉపవాసాలు చేస్తున్నారు. లంఖనం పరమౌషధం అనేది మనం వినే ఉంటాం. అయితే, ప్రత్యేక సందర్భాల్లో ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి ఏం ఢోకా ఉండదు కానీ, అప్పుడప్పుడు ఉపవాసాలు చేస్తూ డొక్కలు మాడ్చుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.
రెగ్యులర్‌గా ఉపవాసం చేయడమే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. దీన్నే 5:2 డైట్ అని కూడా అంటుంటారు. అంటే వారంలో 5 రోజులు నార్మల్‌గా ఆహారాలు తీసుకుని మిగతా 2 రోజులు తిండిపై పరిమితులు పెట్టుకుంటారు. ఈ డైట్ కారణంగా చాలా మంది శరీరం బరువు తగ్గుతుంటారు. కొవ్వు శాతం తగ్గి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. అయితే, బ్లడ్ షుగర్ స్థాయిల్లో తేడాలున్నవారు, గర్భవతులు, బాలింతలు, టీనేజీ అమ్మాయిలు, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నవారు, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఈ అడపాదడపా ఉపవాసాల జోలికెళ్లకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అధ్యయనం ఫలితమిది..
అడపాదడపా ఉపవాసం చేస్తున్నవారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోరు. నీరు, బ్లాక్ కాఫీ, టీ వంటి తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాలు, పానీయాలే తీసుకుంటారు. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. అయితే, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌పై జరిపిన అధ్యయనం ఫలితాలు ఈటింగ్ బిహేవియర్స్ పత్రికలో ప్రచురించారు. యుక్త వయస్కుల్లో ఈ రకం ఉపవాసాల వల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండకపోవచ్చునని, ఇది క్రమరహితమైన ఆహారపుటలవాట్లకు దారితీయవచ్చునని నివేదిక స్పష్టం చేస్తున్నది. అడపాదడపా ఉపవాసం-ప్రవర్తనలు-తినే రుగ్మతల సైకోపాథాలజీ మధ్య సంబంధం న్నదని ఈ అధ్యయనం చేపట్టిన పరిశోధకులు కనుగొన్నారు.
అడపాదడపా ఉపవాసాల కారణంగా ఇన్సులిన్ సెన్సిటివిటీ, గుండె ఆరోగ్యం మెరుగవడం నుంచి అల్జీమర్స్ వ్యాధి, క్యాన్సర్ వంటి రుగ్మతలను నివారించడం వరకు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నట్లు ఇదివరకే తేలింది. అయితే, ప్రస్తుత పరిశోధకులు మాత్రం భిన్నంగా సూచిస్తుండటం విశేషం. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రిక్రూట్ చేసుకున్న మహిళలు, పురుషులు, థర్డ్ జెండర్ వ్యక్తుల నుంచి డాటాను సేకరించారు. 2,762 మంది కౌమార, యువకుల డాటాను పరిశోధకులు విశ్లేషించారు. ఈ రకం ఉపవాసం ఇటీవలికాలంలో ప్రాచుర్యం పొందిందని, పెద్ద సంఖ్యలో ప్రజలు ఆచరిస్తున్నారని కనుగొన్నట్లు అధ్యయన రచయిత కైల్ టీ గాన్సన్ తెలిపారు. అయితే, ఈ రకం ఉపవాసాలపై మరింత లోతైన పరిశోధన చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన పేర్కొన్నారు.