జ్ఞాపకశక్తి సమస్యలున్న వృద్ధులు పజిల్స్‌ను పరిష్కరించడం ద్వారా మనుషుల్ని గుర్తించే సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని, మెదడు కుంచించుకుపోకుండా కాపాడుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. క్రమంతప్పకుండా మూడు నెలలపాటు ప్రహేళికలను పరిష్కరించిన వారిని, అలా చేయని వారితో పోల్చిచూసి పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ ఫలితం ‘న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడి సిన్’లో ప్రచురితమైంది. అధ్యయనంలో పాల్గొన్నవారిలో కొంత మందికి 12 వారాలపాటు మెదడుకు పదును పెట్టే ఆటలు ఆడించారు. అదే సమయంలో మిగిలినవారిని ఖాళీగా ఉంచారు. వీరిలో ఆటల్లో పాల్గొన్నవారి మెదడు, ఆడనివారితో పోలిస్తే చురుగ్గా పనిచేసిందట. క్రాస్‌వర్డ్స్ పూర్తిచేయడం అనేది తీవ్రమైన జ్ఞాపకశక్తి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. ఓ మోస్తరు సమస్యలు ఉన్నవారికేమో క్రాస్‌వర్డ్స్, ఆటలు రెండూ ఉపయోగకరంగా ఉంటాయట.
కొవ్వు, చక్కెర అధికంగా ఉండే పాశ్చాత్య రుచులకు, కాలేయ సంబంధ వ్యాధి అయిన నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్ఏఎఫ్ఎల్డీ)కు దగ్గరి సంబంధం ఉందట. ఈ విషయాన్ని మిస్సోరి విశ్వవిద్యాలయానికి చెందిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ వెల్లడించింది. దీర్ఘకాలిక కాలేయ వ్యాధులకు మూలకారణం ఎన్ఏఎఫ్ఎల్డీ. అనారోగ్యకరమైన ఆహారం పొట్టలోని సూక్ష్మజీవుల మీద దుష్ప్రభావం చూపుతుంది. ఇది కాలేయాన్ని దెబ్బతీసే రోగకారకాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఈ పరిశోధన ఎలుకల మీద నిర్వహించారు. అధిక కొవ్వు, చక్కెర ఉన్న పదార్థాలను ఎలుకలకు పెట్టినప్పుడు.. వాటి పొట్టలో, కాలేయంలో.. ఇన్ఫ్లమేషన్, ఫైబ్రోసిస్ (కాలేయం గట్టిపడటం) వృద్ధి చెందించే బ్లాటియా ప్రొడక్టా అనే బ్యాక్టీరియా పెరగుదలకు కారణమైంది. ఇది ఎలుకల్లో నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ లేదా ఫ్యాటీ లివర్ డిసీజ్‌కు దారితీసిందట.
వివిధ కారణాల వల్ల ఒంటరిగా మారిన తల్లులు కుటుంబ పోషణకు ఏదో ఒక పని చేయాల్సిన పరిస్థితులు తలెత్తడం సహజం. అయితే, ఈ పరిణామం కౌమారంలో ఉన్న పిల్లల మీద దుష్ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు ఒంటరి తల్లులు రోజంతా ఇంటికి దూరంగా ఉండటం అనేది.. పిల్లల మానసిక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తుందని తేలింది. లండన్‌లోని కింగ్స్ కాలేజ్ ఈ అధ్యయనం నిర్వహించింది. ఒంటరి తల్లులు ఉద్యోగానికి వెళ్తే, పిల్లల మీదపడే దుష్ప్రభావాలు స్వల్పమైనవే అయినా, ఆ తీవ్రత మాత్రం ఎక్కువేనని పరిశోధకులు వెల్లడించారు.