పాలకూర భారతీయుల వంటింట్లో తప్పకుండా ఉండే ఆకు కూరల్లో ప్రధానమైంది. పప్పు, కూర, పచ్చడి మొదలైన వంటకాలకు సంబారంగా ఉండే పాలకూరతో సలాడ్లు కూడా చేసుకోవచ్చు. ఇతర కూరగాయలకు జోడించుకోవచ్చు. రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే పాలకూరతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.
విటమిన్ ఎ, సి, కె, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్ లాంటి అత్యవసర పోషకాలు పాలకూరలో పుష్కలం. పైగా ఇందులో క్యాలరీలు తక్కువ. కాబట్టి, ఊబకాయం ముప్పు లేకుండానే శరీరానికి తగినన్ని పోషకాలు అందుతాయి.
శరీరంలో రక్తం ఉత్పత్తికి, ఆక్సిజన్ సరఫరాకు ఐరన్ కీలకం. పాలకూర ఐరన్ గని. దీంతో శాకాహారులు, ఐరన్ లోపంతో వచ్చే వ్యాధి ఎనీమియా ఉన్నవాళ్లకు పాలకూర ఎంతో ప్రయోజనకరం.
పాలకూరలో ల్యూటీన్, జియాజాంతిన్ అనే మూలకాలు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి.
విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు పాలకూరలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. శరీరాన్ని జబ్బులు, ఇన్ఫెక్షన్ల బారినుంచి కాపాడతాయి.
పాలకూరలో విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి సహకరిస్తుంది. సీబమ్ ఉత్పత్తికి సహకరించి జుట్టును మాయిశ్చరైజ్ చేస్తుంది. అదే సమయంలో పాలకూరలో నీటి శాతం కూడా ఎక్కువే. దీంతో చర్మం హైడ్రేటెడ్‌గా, కాంతిమంతంగా ఉంటుంది.
ఫైబర్‌తో సమృద్ధమైన పాలకూర జీర్ణక్రియను క్రమబద్ధం చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. పొట్ట ఆరోగ్యానికి మేలుచేస్తుంది. జీర్ణవ్యవస్థలో పేరుకున్న మలినాల (టాక్సిన్లు)ను సహజంగా డీటాక్సిఫై చేసేస్తుంది.
ఎముకల ఆరోగ్యానికి విటమిన్ కె అత్యవసరం. విటమిన్ కెకు పాలకూర సహజమైన వనరు. ఎముకల బలోపేతానికి విటమిన్ కె క్యాల్షియంతో కలిసి పనిచేస్తుంది. ఎముకల పగుళ్ల ముప్పును తగ్గిస్తుంది.
పాలకూరలో నైట్రేట్లు ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. ధమనుల పనితీరును మెరుగుపరుస్తాయి. గుండె రక్తకవాటాల ఆరోగ్యానికి దోహదపడతాయి.
పాలకూరలో ైగ్లెసిమిక్ ఇండెక్స్ తక్కువ. పైగా ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను క్రమబద్ధం చేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంపొందిస్తుంది. కాబట్టి, డయాబెటిస్ రోగులకూ పాలకూర ఉపయోగకరమే.
ఆరోగ్య ప్రయోజనాలను అలా ఉంచితే, పాలకూర అమూల్యమైన ఆహార పదార్థం. దీంతో వేపుడు చేసుకోవచ్చు. సలాడ్లలో కలుపుకోవచ్చు. కూరలు, సూపులు, ఆమ్లెట్లు, పాస్తాలో జోడించుకోవచ్చు.
ఈసారి వంటకు సిద్ధమయ్యేటప్పుడు మీ పళ్లెంలో పాలకూర కూడా ఉండేలా చూసుకోండి.పాలకూర ఆకుపచ్చటి హీరో.