వేసవి తాపం రోజురోజుకూ పెరుగుతున్నది. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత మొదలై, మధ్యాహ్నానికి నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. ఇలాంటి సమయంలోనే అనేకమంది వడదెబ్బకు గురవుతున్నారు. ఇది అకస్మాత్తుగా వచ్చేది కాదని, మన శరీరంపై రోజువారీగా పడే వేడి ప్రభావం ఒక స్థాయికి చేరినప్పుడు అది ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వడదెబ్బను నివారించడానికి కొన్ని సూచనలు తెలియజేస్తున్నారు.
సమయపాలన: ఎండ తీవ్రత ఎకువగా ఉండే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. పనులన్నీ ఉదయాన్నే లేదా సాయంత్రం వేళల్లోనే ముగించుకోవాలి.
జీర్ణక్రియపై శ్రద్ధ: వేసవిలో ఒకేసారి భారీగా భోజనం చేయడం ప్రమాదకరం. తకువ పరిమాణంలో ఎకువ సార్లు ఆహారం తీసుకోవాలి. భారీ భోజనం చేస్తే, శరీరం దాన్ని అరిగించడానికి రక్త ప్రసరణను పొట్ట వైపు మళ్లిస్తుంది. దీనివల్ల చర్మం ద్వారా వేడి బయటికి వెళ్లే ప్రక్రియ
మందగిస్తుంది.
శరీరాన్ని చల్లబరచడం: రోజూ పది నిమిషాల పాటు చన్నీటి స్నానం చేయడం లేదా మణికట్టు, మెడ ప్రాంతాల్లో తడి గుడ్డతో తుడుచుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తక్షణమే తగ్గుతుంది.
నీళ్లు తాగే విషయంలో జాగ్రత్త: శరీరానికి నీరు అందించడంలో మనం చేసే చిన్నచిన్న తప్పులే పెద్ద సమస్యలకు దారితీస్తాయి. దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం అంటే అప్పటికే మీ శరీరం 1-2 శాతం డీహైడ్రేషన్ బారిన పడిందని అర్థం. కాబట్టి దాహం వేయకముందే నీరు తాగుతూ ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ, ఎండలు ఎకువగా ఉన్నప్పుడు బెడ్ కాఫీకి బదులుగా 400-500 మి.లీ. నీటిని తాగాలి. అలాగే మధ్యాహ్నం కేవలం నీరు మాత్రమే కాకుండా కొబ్బరి నీళ్లు లేదా ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది.
వేసవిలో ఫ్రిజ్లోని చల్లటి నీళ్లు తాగడం హాయిగా అనిపించినా, అది ఆరోగ్యానికి మంచిది కాదు. అధిక చల్లదనం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి, శరీరానికి నీరు అందే ప్రక్రియ ఆలస్యమవుతుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీరు లేదా కుండ నీళ్లు తాగడం వల్ల శరీరం త్వరగా రీహైడ్రేట్ అవుతుంది. అలాగే ఎండ తీవ్రత 38 డిగ్రీలు దాటినప్పుడు ఫ్యాన్లు కేవలం వేడి గాలినే తిప్పుతాయి, దీనివల్ల శరీరం నుంచి తేమ ఆవిరైపోతుందే తప్ప చల్లదనం లభించదు. చెమట పట్టడం ఆగిపోవడం అనేది వడదెబ్బకు అతిపెద్ద హెచ్చరిక. అలాంటి పరిస్థితి కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. అధిక బరువు, మధుమేహం, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అలాగే బీపీ మందులు వాడేవారు కూడా వేడికి త్వరగా ప్రభావితమవుతారు. వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలు, ఎండలో పని చేసే కూలీలు వేసవిలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి.