Foods | రోజూ మనం రకరకాల ఆహారాలను తింటుంటాం. వెజిటేరియన్లు శాకాహారాలలో వివిధ రకాల వెరైటీ రుచులను ఆస్వాదిస్తారు. నాన్ వెజ్ ప్రియులు కూడా తరచూ పలు రకాల మాంసాహారాలను తింటుంటారు. ఇవే కాకుండా ఇంటా బయటా చిరు తిళ్లను, పండ్లను, ఇతర ఆహారాలను కూడా మనం తింటుంటాం. అయితే ఏ ఆహారాన్ని తిన్నా కూడా అది జీర్ణం అయ్యేందుకు కాస్త సమయం పడుతుంది. అందుకనే సులభంగా జీర్ణం అయ్యే ఆహారాలనే తినాలని వైద్యులు చెబుతుంటారు. అలాగే అతిగా ఆహారాన్ని తినకూడదని కూడా సూచిస్తుంటారు. ఇక కొందరు కొన్ని రకాల ఆహారాలను మరీ అతిగా తింటారు. దీంతో అవి సరిగ్గా జీర్ణం కాక ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలోనే ఏయే ఆహారాలను తింటే అవి సరిగ్గా జీర్ణం కావు.. వాటితో ఎలాంటి సమస్యలు వస్తాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బాగా వేయించిన ఆహారాలను ఎప్పుడో ఒకసారి తింటే ఫర్వాలేదు. కానీ తరచూ తింటే మాత్రం అజీర్తిని కలగజేస్తాయి. వేయించిన ఆహారాలు సరిగ్గా జీర్ణం కావు. వీటిని అతిగా తింటే అంతే సంగతులు. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. వేయించిన ఆహారాల్లో నూనె అధికంగా ఉంటుంది. కనుకనే ఈ ఆహారాలు అంత సులభంగా జీర్ణం కావు. కొందరు బయట మిర్చి బజ్జీలు, పునుగులు వంటి ఆహారాలను తరచూ తింటుంటారు. ఇవి సరిగ్గా జీర్ణం కావ. తరచూ వీటిని తింటే అజీర్తి ఏర్పడి అది మలబద్దకానికి దారి తీస్తుంది. దీంతో పైల్స్ కూడా ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఈ ఆహారాలను తరచూ తినకూడదు. ఇవి జీర్ణక్రియకు హాని చేస్తాయి.
కొందరు మసాలా ఆహారాలు అన్నా, కారం ఉండే ఆహారాలు అన్నా ఇష్టంగా తింటారు. వీటిని కూడా ఎప్పుడో ఒకసారి తింటే ఓకే. కానీ తరచూ తింటే మాత్రం సమస్యలను కలగజేస్తాయి. మసాలా, కారం ఆహారాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక ఈ ఆహారాలను తింటే మేలే జరుగుతుంది. కానీ వీటిని అధికంగా తింటే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఇవి కూడా సరిగ్గా జీర్ణం కావు. కడుపులో మంట, గ్యాస్‌ను కలగజేస్తాయి. ఇక కొందరికి పాలు పడవు. పాల ఉత్పత్తులను తీసుకున్నా కూడా సరిగ్గా జీర్ణం కావు. పాలలో లాక్టోస్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఒక రకమైన చక్కెర. కొందరికి లాక్టోస్ ఉండే పాల వంటి ఆహారాలను తింటే అలర్జీలు వస్తాయి. ఇంకా కొందరికి ఈ ఆహారాలు పడక అజీర్తి సంభవిస్తుంది. కనుక ఈ పదార్థాలు పడని వారు కూడా దూరంగా ఉంటే మంచిది.
ఆకుకూరలను తరచూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీటిల్లో ఉండే ఫైబర్ జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. అయితే కొందరికి ఆకుకూరలు పడవు. వీటిని తింటే జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాంటి వారు కూడా వీటికి దూరంగా ఉండాలి. పప్పు దినుసులు, రాజ్మా, బీన్స్, గింజలు వంటి ఆహారాలు కొందరికి జీర్ణం కావు. జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. అలాగే నిమ్మ జాతికి చెందిన సిట్రస్ ఫలాలు కొందరికి అజీర్తిని కలగజేస్తాయి. నిమ్మ, నారింజ, బత్తాయి వంటి పండ్లు సరిగ్గా జీర్ణం కాని వారు కూడా ఉంటారు. వారు కూడా ఈ పండ్లను తినకూడదు. ఇలా కొన్ని ఆహారాలు కొందరిలో జీర్ణ సమస్యలను కలగజేసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆయా ఆహారాలను వారు తినకపోవడమే మంచిది.