బయట వాతావరణం ఎలా ఉన్నా.. పడగ్గదిలోకి వెళ్లగానే ఏసీ ఆన్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. పనిచేసే చోట ఏసీ కామన్! నిద్రవేళలోనూ ఏసీ తప్పనిసరి చేసుకుంటున్నారు. కాలంతో నిమిత్తం లేకుండా ఫుల్లుగా ఏసీ వేసుకొని.. ముసుగు తన్ని పడుకుంటుంటారు. అయితే, రెగ్యులర్గా ఏసీలో పడుకుంటే ఆరోగ్యం మీద దుష్ప్రభావం పడుతుంది. ఏసీ కారణంగా తలెత్తే కొన్ని సమస్యలు..
కండ్లు పొడిబారడం: ఏసీ గాలిలో ఉన్న తేమను తొలగించివేస్తుంది. దీంతో కండ్లు పొడిబారతాయి. ఫలితంగా కండ్లలో దురద, అసౌకర్యం కలుగుతుంది.
మబ్బుగా ఉండటం: ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు మన జీవక్రియల రేటు కూడా తగ్గిపోతుంది. దీంతో శరీర క్రియలు నెమ్మదిస్తాయి. అలసట, మత్తుగా ఉండటం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.
డీహైడ్రేషన్: ఏసీ కారణంగా గాలి పొడిబారడంతో గదిలో తేమ వేగంగా తగ్గిపోతుంది. చల్లగా హాయిగానే ఉంది కదా అని నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ బారినపడతాం.
పొడిబారే చర్మం: చర్మంపై తేమ కూడా తగ్గిపోతుంది. ఇది చర్మం పొడిబారడం, పొలుసులుగా మారడం, మంట పుట్టడానికి దారితీస్తుంది.
తలనొప్పులు: ఏసీ ఆన్ చేయడంతో వేడిగా ఉన్న వాతావరణం చల్లబడిపోతుంది. దీంతో తలనొప్పి, సైనస్ సమస్యలు పుట్టుకొస్తాయి.
శ్వాస సమస్యలు: చల్లటి పొడి గాలి మన శ్వాసనాళాల్లో మంటకు (ఇరిటేషన్) కారణం అవుతుంది. దీంతో ఆస్తమా, అలర్జీలు ఉన్నవాళ్లు మరింత ఇబ్బంది పడతారు. పైగా ఏసీలు ధూళికణాలు, పరాగరేణువులు, ఫంగస్ లాంటివాటికి ఆశ్రయంగా ఉంటాయి. ఇది కూడా ఆస్తమా, అలర్జీలు ఉన్నవాళ్లకు ఇబ్బంది కలిగిస్తుంది. ముక్కు సమస్యలకూ ఆస్కారం ఉంది.
వీటితోపాటు ఏసీలను సరిగ్గా శుభ్రం చేయకపోతే అవి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్లను వ్యాప్తిచేస్తాయి. ఇంకా గదుల లోపల ధూళి, పెంపుడు జంతువుల బొచ్చు మొదలైనవి పేరుకుపోతాయి. ఇవి శ్వాస వ్యవస్థలో మంటకు, ఇతర ఆరోగ్య సమస్యలకు హేతువులు అవుతాయి. అంతేకాదు బయటి ఉష్ణోగ్రతల ప్రభావానికి తేలిగ్గా లోనయ్యే నవజాత శిశువులకు తగిన విధంగా ఏసీ ఉష్ణోగ్రతలు మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లేకుంటే చల్లటి వాతావరణంలో రోజుల పిల్లలు ఇబ్బంది పడతారు.