శారీరక శ్రమకు, మానసిక ఆందోళనకు చక్కని ఔషధం నిద్ర. ఆరు గంటలు ఆదమరచి నిద్దరోతే.. సమస్యలన్నీ పరారైన అనుభూతి కలుగుతుంది. కానీ, సుఖమెరుగని నిద్ర.. అతివలకు అంతగా అందడం లేదని సర్వేల సారాంశం. స్లీప్ ఫౌండేషన్ ఇచ్చిన నివేదిక.. పురుషుల కన్నా స్త్రీలు నిద్రలేమితో ఎక్కువగా బాధపడుతున్నారని తేల్చింది. ఉద్యోగం, ఇల్లు, పిల్లలు, ఇతర బాధ్యతలతో మల్టీ టాస్కింగ్ చేస్తున్న మహిళలు సరైన నిద్ర లేక సతమతమవుతున్నారని నివేదిక సారాంశం. ఇందుకు కారణాలూ లేకపోలేదు.
రుతుక్రమంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్లలో హెచ్చుతగ్గులు నిద్రకు భంగం కలిగిస్తాయి. ముఖ్యంగా రుతుస్రావం ముందు, మెనోపాజ్ సమయంలో వేడి ఆవిర్లు, రాత్రి చెమటలు నిద్రను భంగపరుస్తున్నాయని పరిశోధకులు తేల్చారు. అంతేకాదు గర్భిణిగా ఉన్నప్పుడు హార్మోన్లలో చోటుచేసుకునే మార్పుల కారణంగా శారీరక అసౌకర్యం ఏర్పడుతుంది. ఇది నిద్ర నాణ్యతపై గణనీయంగా ప్రభావం చూపుతుందట. ఈ నిద్రలేమి హృదయ సంబంధ వ్యాధులు, మానసిక రుగ్మతలకు దారి తీస్తుందని ఆరోగ్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుఖనిద్రకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవడం అవసరమని సూచిస్తున్నారు.