Sleep Deprivation Symptoms | మనం ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతోపాటు రోజూ వ్యాయామం కూడా చేయాలి. అలాగే వేళకు భోజనం చేయాలి. సమయానికి నిద్రించాలి. రోజుకు తగినన్ని గంటల పాటు నిద్రపోవాలి. అప్పుడే మనం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. కానీ ప్రస్తుతం నడుస్తున్న ఉరుకుల పరుగుల బిజీ యుగం కారణంగా చాలా మంది నిత్యం అనేక సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటూ సరిగ్గా నిద్ర పోవడం లేదు. దీంతో అనేక జీవనశైలి వ్యాధులు వస్తున్నాయి. అధికంగా బరువు పెరుగుతున్నారు. టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల బారిన పడుతున్నారు. వీటిన్నింటికీ ప్రధాన కారణం నిద్రలేకపోవడమే అని సైంటిస్టులు తమ అధ్యయనాల ద్వారా చెబుతున్నారు. ఈ క్రమంలోనే మనం సరిగ్గా నిద్రించకపోతే మన శరీరం పలు లక్షణాలను తెలియజేస్తుంది. వాటిని గుర్తించడం ద్వారా నిద్ర సరిగ్గా పోవడం లేదని అర్థం చేసుకోవచ్చు.
ముందు రోజు రాత్రి సరిగ్గా నిద్రలేకపోతే ఉదయం నిద్ర లేచిన వెంటనే అలసటగా ఉంటుంది. చిన్న పని చేసినా అలసిపోయినట్లు నీరసంగా మారిపోతారు. నిద్ర సరిగ్గా లేదని చెప్పేందుకు ఇది ప్రధాన లక్షణం. అలాగే సరిగ్గా నిద్రించకపోతే మెదడు మొద్దుబారిపోయినట్లు అవుతుంది. దీంతో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఏ పని మీద ఏకాగ్రత ఉండదు. బద్దకంగా అనిపిస్తుంది. ఏ పని కూడా చేయాలనిపించదు. సరిగ్గా నిద్రించకపోతే హార్మోన్లపై ప్రభావం పడుతుంది. ఇవి డిప్రెషన్‌ను కలిగిస్తాయి. సరిగ్గా నిద్రలేకపోతే ఆ రోజంతా విచారంగా, మూడీగా ఉంటారు. ఏదో కోల్పోయినట్లు దిగులుగా ముఖం పెడతారు. విచారంతో ఇబ్బంది పడతారు.
నిద్ర సరిగ్గా లేని వారు ఆహారం అధికంగా తింటారని వైద్యులు చెబుతున్నారు. మీరు కూడా ఆహారాన్ని అతిగా తింటున్నారేమో చెక్ చేసుకోండి. ఇందుకు నిద్రలేమిని ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇలా జరిగితే అధికంగా బరువు పెరుగుతారు. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీంతో ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. సరిగ్గా నిద్రలేకపోతే దాని ప్రభావం మన శరీర రోగ నిరోధక వ్యవస్థపై కూడా పడుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది. దీర్ఘకాలంగా ఇది జరిగితే తరచూ దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. అవి అసలు ఒక పట్టాన తగ్గవు. ఈ లక్షణాలన్నీ నిద్రలేమిని సూచిస్తాయి.
సరిగ్గా నిద్రించకపోతే వాహనాలను డ్రైవింగ్ చేయడంలో ఇబ్బంది పడుతుంటారు. రోడ్డు మీద ధ్యాస ఉండదు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సరిగ్గా నిద్రించని ప్రభావం కళ్లపై కూడా పడుతుంది. అలాంటి వారికి కళ్లు మసకగా కనిపిస్తుంటాయి. సరిగ్గా నిద్రిస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. సరిగ్గా నిద్రలేని వారు ఆహారం అధికంగా తీసుకుని బరువు కూడా పెరుగుతారు. ఇది షుగర్ వ్యాధికి కూడా కారణం అవుతుంది. కనుక మనం రోజూ తగినన్ని గంటల పాటు కచ్చితంగా నిద్రించాలి. రాత్రి 10 గంటల వరకు నిద్రించి ఉదయోం 5 లేదా 6 గంటలకు నిద్ర లేవాలి. తరువాత వ్యాయామం చేయాలి. అనంతరం మీకు కావల్సిన పనులను చేసుకోవచ్చు. ఇలాంటి దినచర్యను పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారని ఫిట్ నెస్ నిపుణులు సూచిస్తున్నారు.