మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకునేందుకు మొదటగా అందరూ ఎంచుకునే మార్గం రన్నింగ్. లేదంటే జిమ్లో కసరత్తులు చేయడం. అయితే మనకు బాగా తెలిసిన ఇవి మాత్రమే కాదు, మరికొన్ని చిట్కాలు మన శరీరాన్ని ప్రతిరోజూ కొవ్వును కరిగించే యంత్రంగా మారుస్తాయి. అవేంటంటే..
7-9 గంటల నిద్ర: సరిపడా నిద్రలేకపోవడం వల్ల మన జీవక్రియ 20-30శాతానికి తగ్గిపోతుంది. దాంతోపాటు కొవ్వును నిల్వచేసే హార్మోన్లు పెరిగిపోతాయి. అందుకే కండరాలు బలంగా మారేందుకు, కొవ్వు పేరుకుపోకుండా ఉండేందుకు ప్రతిరోజు 7 నుంచి 9 గంటల నిద్ర తప్పనిసరి.
8వేల అడుగులు: ప్రతిరోజు 8000 అడుగులు ప్రశాంతంగా నడవడం వల్ల ఒత్తిడి లేకుండానే కొవ్వు కరుగుతుంది. అంటే ఈ నడకలో మరీ వేగం అక్కర్లేదన్నమాట.
3-4 సార్లు వెయిట్ ట్రైనింగ్: కండరాలు బలంగా ఉండేందుకు వారంలో 3-4సార్లు వెయిట్ ట్రైనింగ్ చేయడం వల్ల మనం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా కేలరీలు ఖర్చవుతాయి. ఇది జీవక్రియకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.
ప్రొటీన్ ఫుడ్: మనం ప్రతిరోజు ప్రొటీన్లు అధికంగా ఉండే భోజనాన్ని తీసుకోవాలి. ప్రొటీన్లలో 30శాతం కేలరీలు జీవక్రియలోనే ఖర్చవుతాయి. ఇవ్వి కొవ్వును కరిగించేందుకు ఉపయోగకరంగా ఉంటాయి.
నీళ్లు తాగండి: భోజనం చేసేముందు నీళ్లు తాగడం వల్ల జీవక్రియ 30శాతం పెరుగుతుంది. దీనివల్ల అతిగా తినకుండా ఆకలి అదుపులో ఉంటుంది.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్: పది గంటల కాల వ్యవధిలో భోజనాలను పూర్తి చేయడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. దీనివల్ల కొవ్వు ఆక్సీకరణం జరిగి రోజంతా శక్తి సమతులంగా ఉంటుంది.
చల్లటి నీటితో స్నానం: చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో బ్రౌన్ ఫ్యాట్ యాక్టివేట్ అవుతుంది. ఫలితంగా కొన్ని గంటల పాటు కేలరీలు కరుగుతాయి.