టమాటాలు లేకుండా వంట సాగదు. కూరల్లోనే కాదు సాస్ ఇతర రూపాల్లో కూడా టమాటా వినియోగం విరివిగా ఉంది. రుచిలోనే కాదు.. పోషకాలు అందించడంలోనూ టమాటా టాప్లో ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఏయే పండ్లు, కూరగాయల్లో ఎలాంటి పోషకాలున్నాయి? ఎంత మొత్తంలో ఉన్నాయి? అని లెక్క తేల్చేందుకు ఒక అధ్యయనం చేసింది. వివిధ పండ్లు, కూరగాయల నుంచి లభించే కేలరీల శక్తితోపాటు విటమిన్లు, మినరల్స్, కీలకమైన పోషకాలు విటమిన్ ఎ, సి, కె, పొటాషియం, ఫైబర్ మొదలైనవి ఎంత పరిమాణంలో ఉన్నాయో లెక్కగట్టారు పరిశోధకులు.
ఆయా పండ్లు, కూరగాయలకు స్కోర్, ర్యాంకులు ఇచ్చారు. సీడీసీ పరిశీలించిన నలభై ఒక్క పండ్లు, కూరగాయల్లో టమాటా టాప్ ప్లేస్లో ఉంది! టమాటాల్లోని లైకోపీన్ అనే యాంటి ఆక్సిడెంట్లు ఆక్సిడేషన్ పెంచే ఒత్తిడిని తగ్గించి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని విటమిన్ సి పెంచుతుంది. బీపీని పొటాషియం నియంత్రణలో ఉంచుతుంది. గుండె పనితీరు సరిగా ఉండేందుకు దోహదపడుతుంది. విటమిన్ కె, ఫొలేట్లు కణాల వృద్ధికి, ఎముకల ఎదుగుదలకు సాయపడతాయి.