దీర్ఘకాలిక జ్ఞాపకాలను ఏర్పరచడానికి మెదడులో దశల వారీగా చర్యలు జరుగుతాయి. ఇందులో పరమాణువులు క్రమపద్ధతిలో పనిచేస్తూ కొన్ని పొరలుగా వీటిని దాస్తాయి. మెదడులోని థలామస్, కార్టెక్స్, జీన్ రెగ్యులేటర్ల మధ్య సమన్వయం ద్వారా ఇది సాధ్యమవుతుందని న్యూయార్క్‌లోని రాక్ఫెల్లర్ విశ్వవిద్యాలయ పరిశోధన అధ్యయనం వెల్లడించింది. వర్చ్యువల్ రియాలిటీ ద్వారా నేర్చుకోవడం అన్న సందర్భాన్ని వీళ్లు తీసుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థలోకి ఎలుకలను పంపి వాటిని గమనిస్తూ దీన్ని నిర్వహించారు.
అక్కడి విషయాలను మెదడు ఎలా గ్రహించి, జ్ఞాపకం పెట్టుకుంటున్నది అన్న దాని మీద వీళ్లు పనిచేశారు. అంటే మెదడు ఒక సంఘటనను లేదా విషయాన్ని తీసుకోవడం, దాన్ని పదిల పరచడం లాంటి పనులు ఎలా చేస్తాయి, ఆ వ్యవస్థ పనితీరు ఏంటి అన్నది అర్థం చేసుకోగలిగారు. ఇక్కడ పనిచేసే ఒక్కో పరమాణువూ ఒక్కో కాల పరిమితికి సంబంధించిన సమాచారాన్ని భద్రపరుస్తుంది. అది తర్వాతి అణువుతో అనుసంధానమవుతూ ఉంటుంది. ఈ వరుసే దీర్ఘకాలిక జ్ఞాపకాలను ఏర్పరచడానికి సహకరిస్తుంది.
మెదడులోని వివిధ ప్రాంతాల్లో ఉండే మాలిక్యులర్ టైమర్లు వీటిని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అయితే ఏది చాలా రోజులు గుర్తు పెట్టుకుంటాం, ఏది కొంత కాలం తర్వాత మర్చిపోతాం అన్నదాన్ని మెదడులోని థలామస్ అనే ప్రాంతం బాధ్యత తీసుకుంటుంది. రోజువారీ సంఘటనలన్నీ వడబోసి కార్టెక్స్ అని పిలిచే మరో చోటికి పంపుతుంది. అక్కడ కొన్ని ఈ అణువుల్లో ఉన్న సమాచారం ద్వారా, రుచి, వాసన, లేదా అనుభూతి ద్వారా ఉత్తేజితమవుతాయి. అలా వాటిని జ్ఞప్తికి తెచ్చుకోగలుగుతాం.
అయితే మెదడులోని మూడు ప్రత్యేక రకాల పరమాణువులు ఇలా జ్ఞాపకాలను దాచేందుకు కాకుండా, వాటిని తాజాగా ఉంచేందుకు పనిచేస్తాయని కూడా దీని ద్వారా కనిపెట్టారు. వీటిలో రెండు రకాలు థలామస్లో ఉంటే, ఒకటి మాత్రం కార్టెక్స్లో పనిచేస్తుంది. వీటి ద్వారా సరిగ్గా సంశ్లేషణ జరగకుండా, బలపడని విషయాలను మాత్రం మనం మర్చిపోతుంటామట. అయితే ఒక పని మళ్లీ మళ్లీ చేయడం ద్వారా కూడా అది దీర్ఘకాలిక జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతుంది. ఈ రీసెర్చ్ అల్జీమర్స్‌లాంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.