e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home ఆరోగ్యం తల్లిపాలు బిడ్డకు శ్రేష్ఠం

తల్లిపాలు బిడ్డకు శ్రేష్ఠం

  • తల్లిపాల విశిష్టత గురించి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్న అంగన్‌వాడీలు
  • మాతాశిశు సంరక్షణకు కృషి చేస్తున్న ప్రభుత్వం

మాతృత్వపు మధురిమతో పాటూ శారీరక పరిపుష్టిని అందించే అద్భుత ఆహారం తల్లిపాలు. శిశు జననం నుంచి కనీసం ఆరు నెలల పాటు తప్పకుండా తల్లిపాలు తాగించడంతో బిడ్డ జీవితకాలం సరిపడా ఆరోగ్యం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. సహజ సిద్ధమైన మొదటి వ్యాక్సిన్‌గా పరిగణింపబడే తల్లిపాలు, శిశువులోని అన్ని అవయవాలతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగుపడడంలోనూ ప్రముఖపాత్ర పోషిస్తాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ మధ్యకాలంలో వివిధ కారణాలతో తల్లులు తమ పిల్లలకు పాలు పట్టించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన వరల్డ్‌ బ్రెస్ట్‌ ఫీడింగ్‌ అలయన్స్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌ సంయుక్తంగా ఆగస్టు మొదటి ఏడు రోజుల పాటు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నాయి. 1992లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం 120 దేశాలు ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రపంచానికి తల్లిపాల విలువను తెలియజేయడం, శిక్షణ తరగతులు నిర్వహించడం, పుట్టినబిడ్డకు కనీసం ఆరునెలలు తల్లి పాలిచ్చేలా ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయించారు.

శారీరక, మానసిక ఆరోగ్యానికి మూలం తల్లిపాలు..
తల్లిపాలు తాగే సమయంలో ఏర్పడే అనుబంధంతో శిశువులో మానసిక ప్రశాంతత కలుగుతుంది. శిశువుకు అవసరమైన ఉష్ణోగ్రతను అందిస్తాయి. కోలోస్ట్రమ్‌గా పిలువబడే తల్లిపాలు శిశువుకు అత్యవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటిన్లను అందిస్తాయి. జీవిత కాలానికి సరిపడే వ్యాధి నిరోధకశక్తిని పెంచే గ్లోబ్యులిన్‌ అనే ప్రోటిన్‌ తల్లిపాలలో అధికంగా ఉంటుంది. శిశువు మొదటిసారి మలవిసర్జన చేయడానికి కారణం తల్లిపాలు. ఫలితంగా కాలేయం ప్రేరేపించబడి బైలురుబిన్‌ అనే వర్ణం విడుదలై కామెర్లవ్యాధి రాకుండా ఉంటుంది. శిశువు రక్తంలో తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచడంలో ఉపకరిస్తాయి. కోలోస్ట్రమ్‌ చిన్నపేగు గోడల్లో పేరుకొని పోషకాల శోషణను పెంచుతుంది. స్థూలకాయాన్ని తగ్గించడమే కాక ఆకస్మిక శిశు మరణాన్ని నివారిస్తాయి.

- Advertisement -

తల్లికీ ఆరోగ్యమే..
పాలివ్వడం ద్వారా కలిగే అనుబంధంతో విడుదలయ్యే ఫీల్‌గుడ్‌ హార్మోన్లు తల్లి ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈస్ట్రోజన్‌ అనే హార్మోన్‌ విడుదలతో గర్భసంచి, రొమ్ము క్యాన్సర్‌ వంటివి దరిచేరవని పరిశోధనల్లో తేలింది. గర్భధారణ సమయంలో అదనంగా పెరిగిన బరువు నుంచి ఉపశమనం పొంది తిరిగి సాధారణ స్థితికి చేరడం సులభం అవుతుంది.

పాలివ్వక పోవడానికి కారణాలు..
పోషకాహారలోపంతో క్షీరగ్రంథులు పాల ను ఉత్పత్తి చేయకపోవడం. పనిచేసే ప్రదేశాల్లో వసతులు లేకపోవడం, శిశువును తీసుకెళ్లే అవకాశంలేకపోవడం, శారీరక అనారోగ్యం, శారీరక సౌందర్యం చెడుతుందనే భావనతో ఇటీవల కాలంలో శిశువులకు తల్లులు పాలు ఇవ్వడం లేదు.

ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ప్రభుత్వం..
కరోనాతో తల్లిపాల వారోత్సవాలను అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ ప్రభు త్వం బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. తల్లిపాల విశిష్టత, తల్లిపాలు ఇవ్వడంతో బిడ్డకు తల్లికి జరిగే లాభాలపై స్త్రీశిశు సంక్షేమశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పాటు పౌష్టికాహార వినియోగంపై క్షేత్రస్థాయిలో ఫ్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నది. అంగన్‌వాడీల ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాముఖ్యతను వివరించే పుస్తకాలను పంచి బాలింతలను అప్రమత్తం చేస్తున్నది.

అవగాహన కల్పిస్తున్నాం..
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేర్యాల, మద్దూరు, కొండపాక, కొమురవెల్లి ధూళిమిట్ట మండలాలకు చెందిన సుమారు 1050 మంది బాలింతలు, 1266 మంది గర్భిణులకు తల్లిపాల విశిష్టతను తెలియజేయడంతో పాటు పాలివ్వడం ద్వారా తల్లికి కలిగే మేలు గురించి వివరిస్తున్నాం. గర్భధారణ మొదలు శిశుజననం తర్వాత ఆరునెలల వరకు బియ్యం, పప్పులు, నూనె, గుడ్లు, పాలు సరఫరా చేస్తున్నాం. 190 అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తల ద్వారా ప్రతినెలా బాలామృతం, సంతులిత ఆహారం అందజేస్తున్నాం. గర్భిణులకు సూచనలు, సలహాలు ఇస్తూ తల్లిపాల విశిష్టతను గురించి తెలిపే పుస్తకాన్ని అందజేస్తున్నాం.

– రమ, సీడీపీవో చేర్యాల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana