మనం కొన్ని సమస్యల్ని చిన్నవే కదా అనుకుంటాం. పెద్దగా పట్టించుకోం కూడా. అయితే చిగుళ్ల సమస్యకు కారణమయ్యే ఒక రకం బ్యాక్టీరియా గుండె కవాటాలను దెబ్బ తీస్తున్నదని ఓ పరిశోధన వెల్లడించింది. ఇటీవల అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ సదస్సులో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. కాల్సిఫిక్ ఆరోటిక్ వాల్వ్ స్టెనోసిస్ అనేది చాలా మందిలో కనిపించే గుండె జబ్బు. శ్వాస సరిగ్గా అందక పోవడం, గుండెల్లో దడ, ఛాతీనొప్పిలాంటి రకరకాల సమస్యలు ఉంటాయిందులో. బృహద్దమని కవాటంలో క్యాల్షియం పేరుకు పోయి గోడలు మందంగా అయ్యి, దీని ద్వారా శరీరానికి రక్తాన్ని పంపు చేయడం కఠినతరం అవుతుంది. దీనివల్ల కళ్లు తి రిగి పడిపోవడం, కొన్నిసార్లు ప్రాణాలే పోవడం కూడా జరగొచ్చు.
వాల్వ్ మార్పిడి ద్వారా సమస్యను తగ్గిస్తారు. అయితే దీర్ఘకాలిక చిగుళ్ల వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా ‘పోర్ఫిరోమోనస్ గింగివాలిస్’కీ, ఈ గుండె కవాటాల్లో జరిగే మార్పులకీ సంబంధం ఉన్నదన్నది ఈ పరిశోధన. ఈ సూక్ష్మజీవి తొలుత చిగురు వాపు, కణజాలం క్షీణించడానికి కారణం అవుతుంది. అది మరింత ముదిరితే పీరిడోంటల్ డిసీజ్‌గా పిలుస్తారు. అంటే ఈ చిగురు వ్యాధి ముదిరి ఇన్పెక్షన్ అయ్యి దంతాల అడుగు భాగం వరకూ వెళ్లి అక్కడ ఎముకను కూడా దెబ్బ తీస్తుంది.
చివరకు పళ్లు కదిలి ఊడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇది రక్తం ద్వారా ప్రవహించి బృహద్దమనిని ప్రభావితం చేస్తున్నట్టు ఇటీవలిఅధ్యయనం తేటతెల్లం చేస్తన్నది. కాబట్టి చిగుళ్ల వ్యాధిని సాధ్యమైనంత త్వరగా నయం చేసుకోవాలనీ, అసలు బ్యాక్టీరియా ప్రభావానికి గురికాకుండా ఉండేలా నోటిని శుభ్రంగా ఉంచుకోవాలనీ వైద్యులు సూచిస్తున్నారు. లేకపోతే అది ఏకంగా ప్రాణాలకే ముప్పుగా మారవచ్చనీ హెచ్చరిస్తున్నారు.